Viral News: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. అది ఏదో హాలీవుడ్ సినిమా సెట్టింగ్ అనుకుంటే మీరు పొరబడినట్లే. ఒక మనిషి తన ఇంట్లో ఇన్ని టన్నుల బంగారాన్ని, ఇన్ని వేల కోట్ల నగదును ఎలా దాచుకోగలడు అనిపించక మానదు. చైనాలోని హైకౌ నగర మాజీ మేయర్ జాంగ్ క్యూ ఇంట్లో జరిగిన సోదాల్లో బయటపడ్డ దృశ్యాలివి. అవినీతి అనే అనకొండ ఎంతలా విస్తరించిందో చెప్పడానికి ఈ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ.
సాధారణంగా ఎవరి ఇంట్లోనైనా కిలోల్లో బంగారం దొరికితేనే అది పెద్ద వార్త అవుతుంది. కానీ, జాంగ్ క్యూ ఇంట్లో ఏకంగా 13.5 టన్నుల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. దీని విలువ ఊహించడం కూడా కష్టమే. ఒక చిన్న దేశం దగ్గర ఉండే నిల్వల కంటే కూడా ఇతడి ఇంట్లోనే ఎక్కువ బంగారం ఉండటం అధికారులనే విస్మయానికి గురిచేసింది. గది నిండా పేర్చిన బంగారు కడ్డీలను చూసి సోదాలకు వెళ్లిన పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు.
కేవలం బంగారం మాత్రమే కాదు, ఇతడి ఇంట్లో దొరికిన నగదును లెక్కించడానికి అధికారులకు చమటలు పట్టాయి. సుమారు 23 టన్నుల బరువున్న కరెన్సీ నోట్ల కట్టలు దొరికాయి. అంటే ఆ డబ్బును తరలించడానికి ఏకంగా ట్రక్కులు వాడాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక సామాన్య అధికారిగా జీవితాన్ని మొదలుపెట్టి, మేయర్ స్థాయికి ఎదిగిన జాంగ్ క్యూ, తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇంతలా అక్రమ ఆస్తులను వెనకేశాడు.
ప్రభుత్వ భూములను తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం, భారీ ప్రాజెక్టుల ద్వారా కమీషన్లు వసూలు చేయడం ద్వారా ఈ ‘అవినీతి సామ్రాజ్యాన్ని’ నిర్మించాడు. కేవలం చైనాలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇతడికి విలాసవంతమైన భవనాలు ఉన్నట్లు తేలింది. అయితే చైనా ప్రభుత్వం ఈ అవినీతి తిమింగలాన్ని అస్సలు వదిలిపెట్టలేదు. అతడు సంపాదించిన ప్రతి పైసాను స్వాధీనం చేసుకోవడమే కాకుండా, దేశ సంపదను దోచుకున్నందుకు అతడికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ వీడియో పాతదే అయినా, ప్రస్తుతం మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అవినీతి పరుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.
🔴L’ancien maire de Pékin, Zhang Qi, a été retrouvé en possession de 13,5 tonnes d’or, 23 tonnes de liquide, des biens immobiliers de luxe en Chine et à l’étranger, ainsi qu’une collection de voitures haut de gamme.
Les enquêteurs ont déterminé que des actifs d’une valeur de… pic.twitter.com/JdXSBceCtJ
— 75 Secondes 🗞️ (@75secondes) January 2, 2026
