TG TET 2026: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2026) నేడు శనివారం ఉదయం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు భారీ సంఖ్యలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో సందడి నెలకొంది. ఈనెల 20వ తేదీ వరకు దాదాపు 9 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు కొనసాగనున్నాయి.
తెలంగాణ టెట్ సమరానికి సర్వం సిద్ధం: 2.37 లక్షల మంది అభ్యర్థులు
ఉపాధ్యాయ కొలువు సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగులతో పాటు ఇప్పటికే విధుల్లో ఉన్న టీచర్లు కూడా ఈ పరీక్షకు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1, పేపర్-2లకు కలిపి మొత్తం 2,37,754 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెట్ స్కోరు తప్పనిసరి కావడంతో, సుమారు 71,670 మంది ఇన్-సర్వీస్ టీచర్లు ఈసారి పరీక్ష రాస్తుండటం గమనార్హం.
Also Read: Pawan Kalyan: నేడు కొండగట్టు ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్
పరీక్షా షెడ్యూల్, సమయాలు
ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) మొత్తం 15 సెషన్లలో నిర్వహించబడతాయి. ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి:
మొదటి సెషన్: ఉదయం 9:00 గంటల నుండి 11:30 గంటల వరకు.
రెండో సెషన్: మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, సమయం దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.
నిబంధనలు, వసతులు
రాష్ట్రవ్యాప్తంగా 97 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అభ్యర్థులు తమ వెంట హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) తప్పనిసరిగా తీసుకురావాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, వాచీలకు అనుమతి లేదు. బయోమెట్రిక్ ప్రక్రియ కోసం అభ్యర్థులు చేతులకు మెహందీ లేదా ఇంక్ వంటివి పెట్టుకోకూడదని సూచించారు.
