Adluri Laxman: జనవరి ఎండింగ్లో మున్సిపల్ ఎన్నికలు

Adluri Laxman: ఉపాధి హామీ (నరేగా) పథకంపై చర్చ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందన్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సభకు హాజరుకాలేదని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీపై విమర్శలు చేసే ధైర్యం బీఆర్ఎస్ నేతలకు లేదని, నరేగా పథకంపై మాట్లాడలేక సభను వదిలి వెళ్లారని ఆయన ఆరోపించారు. “మామ సభలో కొట్లాడు అని చెప్పి పంపిస్తే, అల్లుడు సభ నుంచి బయటకు వెళ్లిపోయాడు” అంటూ ఎద్దేవా చేశారు. సభను బహిష్కరించారనే అంశమే సభలో జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

నీళ్లపై చర్చ ఉంటుందని తెలియగానే బీఆర్ఎస్ నేతలు పారిపోయారని, సభలో పాల్గొని మాట్లాడకుండా బయట ఎంత విమర్శలు చేసినా అవి వృథానేనని లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా బీఆర్ఎస్ వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని, తమ పంతం నెగ్గించుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు.

పేదల సంక్షేమ పథకాలపై మాట్లాడే ఆసక్తి బీఆర్ఎస్‌కు లేదని విమర్శించిన ఆయన, తమపై ఆరోపణలు ఉంటే అసెంబ్లీలోనే నిరూపించాలని సవాల్ విసిరారు. మూసీ అంశంలో బీఆర్ఎస్ నేతలే రన్నింగ్ కామెంటరీ చేసిన విషయం అందరికీ తెలుసని, ఆ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నమే మిగిలిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ ఎమ్మెల్యేలకు కూడా సభలో కనీస గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు.

ఇక సంక్షేమ అంశాలపై మాట్లాడుతూ, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలోని విద్యార్థులకు వేడి నీటి సౌకర్యం కల్పించేందుకు సోలార్ పవర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెలాఖరు కల్లా మున్సిపాలిటీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముందని, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *