Garikapati: యూట్యూబర్ అన్వేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఫాలోవర్స్ తగ్గడం, నెగెటివ్ రియాక్షన్ పెరగడంతో అన్వేష్ బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పాడు. ఈ వ్యవహారం ఇంకా చల్లారకముందే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన పరోక్ష వ్యాఖ్యలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
ఇటీవల ఓ ప్రవచనంలో గరికపాటి అన్వేష్ పేరు ఎక్కడా ప్రస్తావించకుండా, సమాజంలో పెరుగుతున్న బాధ్యతారాహిత్యపు మాటల సంస్కృతిపై తీవ్రంగా స్పందించారు.
“ఒక నేరస్థుడికి శిక్ష పడితే మారతాడో లేదో తెలియదు. కానీ పది మంది కలిసి అతడిని ఈసడించుకుంటే మాత్రం పది రోజుల్లో మారతాడు” అని వ్యాఖ్యానించారు.
తప్పు చేసిన వారిని ప్రశ్నించే ధైర్యం సమాజానికి ఉండాలని, అవసరమైతే ముఖం మీదే తప్పు అని చెప్పగలగాలని స్పష్టం చేశారు. అలా చేయకపోతే తప్పు చేయని వారిపైనా బురద జల్లుతూ వ్యక్తిత్వ హననం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి విషయాలను చాలామంది చూసీ మౌనంగా ఉండిపోతారని, ‘మనకెందుకు’ అనుకుని వదిలేస్తారని చెప్పారు. అయితే తన విషయంలో మాత్రం అభిమానులు ఎప్పుడూ తప్పు కనిపిస్తే వెంటనే స్పందిస్తారని, అదే ఆరోగ్యకరమైన పరిస్థితి అని గరికపాటి పేర్కొన్నారు. సోషల్ మీడియాలోనూ నైతిక విలువలకు మద్దతే చివరకు పైచేయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
