Maoist Party

Maoist Party: మావోయిస్టు పార్టీకి భారీ షాక్.. రేపు డీజేపీ ముందు లొంగిపోనున్న కీలక నేత బర్సే దేవా

Maoist Party: తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో అత్యంత కీలకమైన ‘పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ’ (PGLA) చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న బర్సే దేవా లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. శనివారం ఆయన తెలంగాణ డీజేపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్థానంలో దేవాను పార్టీ ఇటీవలే నియమించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హిడ్మా మరియు బర్సే దేవా ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు.

మావోయిస్టు పార్టీలో బర్సే దేవా పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా పార్టీకి అవసరమైన ఆయుధాల సరఫరాలో ఆయన ప్రధాన బాధ్యతలు చూసేవారు. దేవా లొంగుబాటు పార్టీకి కోలుకోలేని దెబ్బని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం దేవా మాత్రమే కాకుండా, ఆయనతో పాటు మరో 19 మంది ఆపరేషన్ సభ్యులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోవడానికి సిద్ధమయ్యారు. వీరంతా పార్టీలో వివిధ కీలక విభాగాల్లో పనిచేస్తున్న వారు.

ప్రభుత్వ పునరావాస కార్యక్రమాల పట్ల ఆకర్షితులై లేదా పార్టీ సిద్ధాంతాల పట్ల విరక్తి చెంది వీరు జనజీవన స్రవంతిలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. రేపు డీజేపీ కార్యాలయంలో జరిగే అధికారిక కార్యక్రమంలో వీరి లొంగుబాటు ప్రక్రియ పూర్తి కానుంది. ఈ పరిణామం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతి స్థాపనకు ఒక ముందడుగుగా పోలీసులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *