IIT Hyderabad

IIT Hyderabad: ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి అద్భుతం.. ఏకంగా రూ. 2.5 కోట్ల వార్షిక వేతనంతో మెగా ఆఫర్!

IIT Hyderabad: హైదరాబాద్‌ ఐఐటీ పేరు వినగానే సాంకేతిక రంగంలో అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ అనిపిస్తుంది. తాజాగా ఇక్కడి విద్యార్థి ఒకరు కళ్లు చెదిరే స్థాయి వేతనంతో ఉద్యోగం సంపాదించి వార్తల్లో నిలిచారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో చివరి ఏడాది చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్ఘీస్‌కు నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ ‘ఆప్టివర్’ భారీ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా రూ. 2.5 కోట్ల వార్షిక ప్యాకేజీతో అతడిని ఎంపిక చేసింది. ఐఐటీ హైదరాబాద్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక విద్యార్థికి లభించిన అత్యధిక ప్యాకేజీ ఇదే కావడం విశేషం.

నిజానికి ఈ విజయం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. ఎడ్వర్డ్ గతంలోనే అదే కంపెనీలో రెండు నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ చేశాడు. అతని పనితీరుకు మెచ్చిన సంస్థ, కోర్సు పూర్తికాకముందే ‘ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్’ రూపంలో ఈ భారీ వేతనాన్ని ప్రకటించింది. కేవలం ఎడ్వర్డ్ మాత్రమే కాకుండా, ఇదే కాలేజీకి చెందిన మరో కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి కూడా రూ. 1.1 కోట్ల ప్యాకేజీ దక్కడం విశేషం. ఐఐటీ హైదరాబాద్‌లో ప్లేస్‌మెంట్స్ ఎంత జోరుగా సాగుతున్నాయో చెప్పడానికి ఇవే నిదర్శనం.

ఎడ్వర్డ్ నాథన్ నేపథ్యం చూస్తే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి కలుగుతుంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఇతను, ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు బెంగళూరులో చదువుకున్నాడు. చిన్నతనం నుంచే చదువులో రాణిస్తూ జేఈఈ మెయిన్స్‌లో 1100 ర్యాంక్, అడ్వాన్స్‌డ్‌లో 558వ ర్యాంక్ సాధించి ఐఐటీలో సీటు సంపాదించాడు. చదువుతో పాటు స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు సాధించడంలోనూ ఎడ్వర్డ్ ఎప్పుడూ ముందే ఉన్నాడు.

ఈ ఏడాది జూలైలో ఎడ్వర్డ్ తన కొత్త ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇంతటి భారీ ప్యాకేజీ సాధించిన ఎడ్వర్డ్ విజయం ఇప్పుడు ఇతర విద్యార్థులకు పెద్ద ప్రేరణగా నిలుస్తోంది. కష్టపడి చదివి, నైపుణ్యాలను పెంచుకుంటే ప్రపంచస్థాయి సంస్థలు మన కోసం తలుపులు తడతాయని ఈ సంఘటన నిరూపిస్తోంది. ఐఐటీ హైదరాబాద్ ఖ్యాతిని మరోసారి ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఎడ్వర్డ్‌పై ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *