Uttam: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును 90 శాతం పూర్తిచేశామని బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు వద్ద తట్టెడు మట్టిని కూడా తీయలేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టుకు 2015లో జీవో జారీ చేసి రూ.35 వేల కోట్ల అంచనా వ్యయం నిర్ణయించారని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటివరకు కేవలం రూ.27 వేల కోట్లే ఖర్చు చేశారని తెలిపారు. అయితే ప్రాజెక్టు పూర్తిగా పూర్తవ్వాలంటే కనీసం రూ.80 వేల కోట్లు అవసరమవుతాయని ఆయన వెల్లడించారు.
రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో కేవలం రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పూర్తిచేశామని చెప్పడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇది ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమే తప్ప వాస్తవాలకు దూరమని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు నిజాలు చెప్పకుండా అబద్ధాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం ప్రాజెక్టు పూర్తి కోసం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ముందుకెళ్తామని మంత్రి స్పష్టం చేశారు.
