Delhi: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలో గందర్బల్ జిల్లాలో పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాద సహాయకులను అరెస్ట్ చేశారు.
అరెస్టైన వారిని నబీ మీర్, షబ్నం నజీర్‌గా గుర్తించారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, అనుమానాస్పద సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో చైనా తయారీ పిస్టల్ ఉండటం కలకలం రేపింది.
అరెస్టైన వ్యక్తులు ఉగ్రవాదులకు లాజిస్టిక్ సపోర్ట్ అందిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరింత లోతైన విచారణ చేపట్టినట్లు తెలిపారు.
భద్రతా బలగాల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు ఆపరేషన్లు మరింత ముమ్మరం చేస్తామని స్పష్టం చేశాయి.
