LPG: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వేళ, దేశంలోని వ్యాపార వర్గాలకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల ప్రభావంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. జనవరి 1, 2026 నుండి అమలులోకి వచ్చిన ఈ నిర్ణయం ప్రకారం, 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరపై ఏకంగా రూ. 111 మేర భారం పడింది. దీంతో వాణిజ్య సిలిండర్ ధర గత ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇటీవల రైల్వే ఛార్జీల పెంపుతో సతమతమవుతున్న వారికి ఈ నిర్ణయం అదనపు భారంగా మారింది.
తాజా ధరల సవరణ తర్వాత దేశంలోని ప్రధాన నగరాల్లో 19 కేజీల సిలిండర్ ధరలు పరిశీలిస్తే, దేశ రాజధాని ఢిల్లీలో ఇది రూ. 1,691.50కి చేరింది. ముంబైలో రూ. 1,642.50, కోల్‌కతాలో రూ. 1,795, చెన్నైలో అత్యధికంగా రూ. 1,849.50 గా నమోదయ్యాయి. ఇక మన హైదరాబాద్ నగరంలో ఈ ధర రూ. 1,912కు చేరుకుంది. ఈ పెరిగిన ధరల వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ సర్వీసుల నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరగనున్నాయి. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో హోటళ్లలో టిఫిన్లు, భోజనాల ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Veng sarkar: సర్ఫరాజ్‌ను సెలెక్ట్ చేయకపోవడం సిగ్గుచేటు
అయితే, ఈ చేదు వార్త మధ్య గృహ వినియోగదారులకు ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. ఇళ్లలో వంట కోసం వాడే 14.2 కేజీల గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో సామాన్యుల ఇంటి బడ్జెట్‌పై ఈ పెంపు ప్రభావం నేరుగా ఉండదు. మరోవైపు, విమాన ప్రయాణీకులకు ఊరటనిస్తూ విమాన ఇంధనం (ATF) ధరను ప్రభుత్వం 7.3 శాతం మేర తగ్గించింది. ఢిల్లీలో కిలో లీటరు ఏటీఎఫ్ ధర సుమారు రూ. 7,353 తగ్గి రూ. 92,323 కి చేరింది. ఏదేమైనా, కొత్త ఏడాది ప్రారంభంలోనే వాణిజ్య గ్యాస్ భారం పెరగడం వ్యాపారులకు మింగుడుపడని అంశంగా మారింది.
