Asaduddin: భారత్–బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మరింత దిగజారకూడదని హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. భారత భద్రతకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల స్థిరత్వానికి బంగ్లాదేశ్ స్థిరమైన పరిస్థితి అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్‌తో సత్సంబంధాలను పునరుద్ధరించడం ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి నిజమైన పరీక్షగా మారిందని ఒవైసీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో కొన్ని శక్తులు అరాచక ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మరణం అనంతరం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అక్కడికి వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇండో–పాక్ ఉద్రిక్తతలపై చైనా వ్యాఖ్యలు అవమానకరం: ఒవైసీ
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో చైనా మధ్యవర్తిత్వం వహించిందన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు భారత్ హుందాతనాన్ని, సార్వభౌమత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆయన ‘ఎక్స్’ వేదికగా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను గట్టిగా ఖండించాలని డిమాండ్ చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇండో–పాక్ మధ్య తీవ్రమైన సంక్షోభం నెలకొన్నదని, అప్పట్లో వాణిజ్య బెదిరింపులతో శాంతి నెలకొల్పినట్లు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా ఒవైసీ ప్రస్తావించారు. ఇప్పుడు చైనా కూడా ఇదే తరహా ప్రకటనలు చేయడం భారత్‌ను తక్కువ చేసి మాట్లాడడమే అవుతుందని ఆయన విమర్శించారు.
భారత్, పాకిస్థాన్‌ను ఒకే స్థాయిలో చూపిస్తూ దక్షిణాసియాలో ప్రభావం పెంచుకోవాలని చైనా ప్రయత్నిస్తోందని ఒవైసీ ఆరోపించారు. చైనా పర్యటన సమయంలో ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారా అని ప్రశ్నించారు. ఇండో–పాక్ యుద్ధాన్ని మధ్యవర్తిత్వం ద్వారా ఆపినట్లు చైనా చెప్పడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.
మూడో దేశం ఎలాంటి జోక్యం చేసుకోలేదన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని, చైనా వ్యాఖ్యలకు బలమైన రీతిలో సమాధానం ఇవ్వాలని అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.
