Ashwini vaishnav: అత్యాధునిక హంగులతో వందే భారత్ స్లీపర్ రైలు

Ashwini vaishnav: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ స్లీపర్ వేరియంట్‌కు సంబంధించిన తొలి రూట్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం అధికారికంగా ప్రకటించారు. అస్సాంలోని గువాహటి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు నడవనుందని తెలిపారు. ఇప్పటికే టెస్టింగ్, సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

ఇటీవల కోటా–నాగ్డా సెక్షన్‌లో నిర్వహించిన ఫైనల్ ట్రయల్ రన్‌లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో విజయవంతంగా ప్రయాణించింది. ఇది రాత్రి ప్రయాణాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన అత్యాధునిక స్లీపర్ ట్రైన్‌గా రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ఈ వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉండనున్నాయి. ఇందులో 11 థర్డ్ ఏసీ కోచ్‌లు, 4 సెకండ్ ఏసీ కోచ్‌లు, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉన్నాయి. ఒకేసారి మొత్తం 823 మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా దీనిని రూపొందించారు. వ్యాపారవేత్తలు, కుటుంబాలు, విద్యార్థులు, పర్యాటకులకు ఈ ఓవర్‌నైట్ జర్నీ ఎంతో అనుకూలంగా ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది.

టికెట్ ధరల విషయానికొస్తే, ఆహారంతో కలిపి థర్డ్ ఏసీ టికెట్ ధర సుమారు రూ.2,300గా, సెకండ్ ఏసీకి రూ.3,000గా, ఫస్ట్ ఏసీకి రూ.3,600గా నిర్ణయించినట్లు సమాచారం. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ రైలును అత్యున్నత ప్రమాణాలతో తయారు చేశారు.

ఈ రైలులో ఎర్గోనామిక్ బెర్తులు, ఆటోమేటిక్ డోర్లు, ఆధునిక లైటింగ్ వ్యవస్థ, శబ్దం తగ్గించే ప్రత్యేక సాంకేతికతతో పాటు కవచ్ యాంటీ-కోలిజన్ సిస్టమ్ వంటి భద్రతా సౌకర్యాలు ఉన్నాయి. వరల్డ్ క్లాస్ సదుపాయాలతో రూపొందిన వందే భారత్ స్లీపర్ రైలు, భారత రైల్వే రాత్రి ప్రయాణాలకు సరికొత్త అనుభూతిని అందించనుందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *