Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసే మాటలకూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా విడుదలైన సమయంలోనే కాకుండా, కొన్ని దశాబ్దాల తర్వాత విన్నా ఆ మాటల్లోని లోతు అలాగే ఉంటుంది. దర్శకుడిగా మారకముందు త్రివిక్రమ్ కొన్ని అద్భుతమైన సినిమాలకి కథలు, మాటలు అందించారు. అందులో ఒకటి ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘నువ్వు నాకు నచ్చావ్’. ఈ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత, జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా రీ-రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది.
ఈ రీ-రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ త్రివిక్రమ్ మరియు నిర్మాత స్రవంతి రవికిశోర్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను త్రివిక్రమ్ పంచుకున్నారు.
ఆ మాట వినగానే మైండ్ బ్లాంక్ అయ్యింది.. “సినిమా విడుదలైన తర్వాత నేను, సునీల్ కలిసి సినిమా చూడటానికి భీమవరం దగ్గర ఉన్న ఒక థియేటర్ కి వెళ్ళాం. సినిమా అయిపోయిన తర్వాత బయట ఒక వ్యక్తిని సినిమా ఎలా ఉందని అడిగితే.. ‘ఈ సినిమా రెండు వారాలు కూడా ఆడదు’ అని తేల్చేశాడు. అది విన్న నాకు ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. మనసు ముక్కలైపోయింది. నేను, సునీల్ కలిసి బైక్ మీద వెళ్ళాము కానీ, ఆ మాటలు వినగానే బండిని అక్కడే వదిలేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాను.” అని త్రివిక్రమ్ గుర్తు చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Sobhita Dhulipala: చెన్నైలో ‘మార్గళియిల్ మక్కళ్ ఇసై’ వేడుకలు: ముగింపు సభలో మెరిసిన శోభితా ధూళిపాళ!
అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చాను.. “ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాను. ‘అమ్మా.. నువ్వు చెప్పిందే నిజమేమో, నేను ఉద్యోగం మానేయకుండా ఉండాల్సింది. ఇప్పటి వరకు నేను రాసినవన్నీ ఏదో ఫ్లూక్ (అదృష్టవశాత్తూ) గా హిట్ అయ్యాయేమో’ అని అమ్మతో చెప్పుకుని బాధపడ్డాను. నా మాటలు విన్న అమ్మ కూడా చాలా దిగులు పడింది.”
శాంతి థియేటర్ ఇచ్చిన ధైర్యం.. “అలాంటి క్లిష్ట సమయంలో నిర్మాత రవికిశోర్ గారు కాల్ చేసి నన్ను హైదరాబాద్ రమ్మన్నారు. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నన్ను ‘శాంతి థియేటర్’ కి తీసుకెళ్లారు. అక్కడ థియేటర్ హౌస్ ఫుల్ బోర్డు చూడటంతో నాకు కొంత ధైర్యం వచ్చింది. ఆ రోజు థియేటర్ లో ఆడియన్స్ రియాక్షన్ చూశాకే నేను ప్రశాంతంగా నిద్రపోయాను. చిత్రమైన విషయం ఏమిటంటే.. భీమవరంలో ఏ థియేటర్ దగ్గరైతే ‘ఈ సినిమా ఆడదు’ అన్నారో, అదే థియేటర్ లో ఈ చిత్రం 300 రోజులు ఆడింది. ఆ సినిమా ఫంక్షన్ కు నేను మళ్ళీ అక్కడికే వెళ్ళాను.” అని త్రివిక్రమ్ ఆనాటి మధుర స్మృతులను నెమరువేసుకున్నారు.
