IBomma Ravi: సామాన్య సినీ ప్రియులకు ఉచితంగా సినిమాలు అందిస్తూ ‘ఐబొమ్మ’ వెబ్సైట్ ద్వారా పాపులర్ అయిన ఇమంది రవి వ్యవహారంలో రోజుకో షాకింగ్ నిజం బయటపడుతోంది. 12 రోజుల పాటు సాగిన పోలీసు కస్టడీ విచారణ నేటితో ముగియగా, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించిన వివరాలు చూస్తుంటే.. రవి కేవలం పైరసీకి మాత్రమే పరిమితం కాలేదని, ఒక పక్కా క్రిమినల్ వ్యూహంతో ముందుకు వెళ్లాడని అర్థమవుతోంది.
ప్రహ్లాద్కే షాక్ ఇచ్చిన ‘నమ్మకద్రోహం’
ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపు ప్రహ్లాద్ అనే వ్యక్తి డాక్యుమెంట్ల దొంగతనం. గతంలో ప్రహ్లాద్‌కు తెలియకుండానే అతని టెన్త్ మెమో, ఆధార్ కార్డులను చేజిక్కించుకున్న రవి, వాటిని తన అక్రమ సామ్రాజ్యానికి పునాదిగా వాడుకున్నాడు. ప్రహ్లాద్ పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలక పత్రాలను సృష్టించి బ్యాంక్ ఖాతాలను నిర్వహించాడు.
ఇది కూడా చదవండి: Ap DGP: ఏపీలో నేరాలు గణనీయంగా తగ్గాయి
విచారణలో భాగంగా బెంగళూరు నుంచి వచ్చిన ప్రహ్లాద్, తన పేరిట రవి సాగించిన ఈ తతంగం చూసి నివ్వెరపోయాడు. తన పాస్‌పోర్ట్ మాత్రం సొంత పేరుతోనే ఉంచుకున్న రవి, ఇతరుల గుర్తింపు కార్డులను అడ్డం పెట్టుకుని పోలీసుల కళ్లగప్పే ప్రయత్నం చేశాడు.
13 కోట్లు.. విదేశాల్లో జల్సాలు
ఐబొమ్మ కంటే ముందు రవి రెండు వెబ్సైట్లు ప్రారంభించినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత భారీ వ్యూహంతో ఐబొమ్మను సృష్టించి కోట్ల రూపాయలు గడించాడు. సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో రవి ఖాతాల ద్వారా మొత్తం రూ. 13 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇందులో రూ. 10 కోట్ల వరకు రవి విదేశాల్లో విలాసవంతమైన జీవితం కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు రవికి సంబంధించిన రూ. 3 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు.
ముగిసిన కస్టడీ.. తదుపరి అడుగు ఎటు?
12 రోజుల విచారణలో రవి నుంచి బ్యాంక్ లావాదేవీలు, వెబ్సైట్ సర్వర్ల నిర్వహణ మరియు అక్రమంగా సంపాదించిన ఆస్తులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. ప్రహ్లాద్‌ను రవి ముందే కూర్చోబెట్టి ప్రశ్నించడంతో నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఐబొమ్మ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? విదేశీ ఖాతాలకు ఈ నిధులు ఎలా తరలించాడు? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
