KTR: తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ముదురుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యాఖ్యల గురించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. సీఎం తిట్లను తాను దీవెనలుగానే భావిస్తానని అన్నారు. ప్రభుత్వం చేసే తప్పులను, దోపిడీని తాను అడ్డుకుంటున్నందుకే రేవంత్ రెడ్డికి కోపం వస్తోందని ఎద్దేవా చేశారు. అయితే, తనను తిట్టినా భరిస్తాను కానీ, తెలంగాణ జాతి పిత కేసీఆర్‌ను విమర్శిస్తే మాత్రం సహించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే భయంతోనే రేవంత్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు పనులను ముందుకు సాగనివ్వడం లేదని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధిని శంకించలేరని, గోదావరి నీటిలో మన హక్కుల కోసమే అదనపు టీఎంసీ పనులను చేపట్టారని స్పష్టం చేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం కాల్వల టెండర్లను రద్దు చేసి ప్రాజెక్టును పక్కన పడేసిందని ఆయన విమర్శించారు.
పార్టీ ఫిరాయింపులు, స్థానిక సంస్థల ఎన్నికల పైనా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీని వదిలి వెళ్లిన నేతలను మళ్లీ చేర్చుకోవాల్సిన అవసరం లేదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. పెద్ద పెద్ద నాయకులు పార్టీ మారినా, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అండగా నిలబడి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించుకున్నారని గుర్తు చేశారు. ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైందని, అందుకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం భయపడుతోందని వ్యాఖ్యానించారు.
చివరగా, అసెంబ్లీలో కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి పలకరించడంపై స్పందిస్తూ.. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకోవడం మంచి సంస్కారమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్‌పై అందరికీ గౌరవం ఉంటుందని, అదే గౌరవం రేవంత్ రెడ్డి మాటల్లో కూడా ఉంటే ఇంకా బాగుంటుందని కేటీఆర్ సూచించారు.
