Road Accident: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి, బంగారు భవిష్యత్తును వెతుక్కుంటున్న ఇద్దరు తెలంగాణ యువతులను విధి వంచించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటనతో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
విహార యాత్రలో విషాదం
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మేఘన (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (24) స్నేహితులు. వీరిద్దరూ అమెరికాలో ఎంఎస్ (MS) పూర్తి చేసి అక్కడే స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో, సరదాగా విహార యాత్రకు వెళ్తుండగా కాలిఫోర్నియా మార్గంలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరు యువతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: 10 ఏండ్లు.. 12.. జ్యోతిర్లింగాలు… ఓం నమః శివాయ
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
మృతుల్లో మేఘన.. గార్ల మండల కేంద్రంలోని మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తె. మరో మృతురాలు భావన.. ముల్కనూరు ఉపసర్పంచ్ కడియాల కోటేశ్వరరావు కుమార్తె. అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డలు, అమెరికాలో ఉన్నత చదువులు చదువుకుని ప్రయోజకులవుతారని ఆశించిన ఆ తల్లిదండ్రులకు ఈ వార్త పిడుగుపాటులా తగిలింది. చేతికి అందిన బిడ్డలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలియడంతో ఆయా గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది.
శోకసంద్రంలో గార్ల మండలం
చదువులో ఎంతో చురుగ్గా ఉంటూ, అందరితో కలుపుగోలుగా ఉండే ఈ యువతుల మరణాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. విదేశాల్లో తమ బిడ్డల భద్రతపై ఆందోళన చెందుతున్న తెలుగు కుటుంబాల్లో ఈ ఘటన మరింత కలకలం రేపింది. మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు.
