Madhuri deekshit: సినిమా టికెట్ల ధరలు విపరీతంగా పెరగడమే థియేటర్లకు ప్రేక్షకులు తగ్గడానికి ప్రధాన కారణమని బాలీవుడ్ ప్రముఖ నటి మాధురి దీక్షిత్ అభిప్రాయపడ్డారు. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల అందుబాటు కూడా థియేటర్లపై ప్రభావం చూపుతోందని ఆమె పేర్కొన్నారు.
ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన మాధురి దీక్షిత్, ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ ఒక్కటే మార్గంగా ఉండేదని, కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని తెలిపారు. ముఖ్యంగా కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆమె విశ్లేషించారు.
“సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారు. ఇటీవలి కాలంలో కొన్ని సినిమాలు భారీ విజయాలు సాధించిన విషయాన్ని మనం చూశాం. కాబట్టి జనం రావడం లేదనడం సరికాదు. అసలు సమస్య మాత్రం టికెట్ ధరలే. ప్రస్తుతం ఒక కుటుంబం అంతా కలిసి సినిమాకు వెళ్లాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. అందుకే ఏ సినిమాకు వెళ్లాలి, ఏది వాయిదా వేయాలి అన్నదానిపై కుటుంబాలు ప్రత్యేకంగా బడ్జెట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది” అని మాధురి తెలిపారు.
ఓటీటీల ప్రభావం గురించి మాట్లాడుతూ, “ఇప్పుడు సినిమాలు మన చేతివేళ్లపైనే ఉన్నాయి. ఉద్యోగాల నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి 8:30 లేదా 9 గంటలు అవుతోంది. ఆ తర్వాత మళ్లీ థియేటర్‌కు వెళ్లడం చాలా మందికి కష్టంగా మారింది. అందుకే వారాంతాల్లో లేదా సెలవు రోజుల్లో మాత్రమే సినిమాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అదే ఓటీటీలో అయితే మనకు నచ్చిన సమయంలో, నచ్చిన చోట సినిమా చూసే సౌలభ్యం ఉంది. ఇంట్లోనే కుటుంబంతో కలిసి తక్కువ ఖర్చుతో సినిమా చూడొచ్చు” అని చెప్పారు.
అయితే ఈ మార్పుల వల్ల సినిమా భవిష్యత్తు ప్రమాదంలో పడిందని తాను భావించడం లేదని మాధురి స్పష్టం చేశారు. “సినిమా భవిష్యత్తుకు ఎలాంటి ముప్పు లేదు. కానీ కొన్ని మార్పులు అవసరం. ప్రేక్షకులకు థియేటర్ అనుభవాన్ని మరింత మెరుగ్గా, అందుబాటు ధరల్లో అందించగలిగితే మళ్లీ పూర్వవైభవం వస్తుంది” అని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
