Chandrababu Naidu

Chandrababu Naidu: మన పురాణాల గురించి పిల్లలకు చెప్పాలి

Chandrababu Naidu: తిరుపతిలో జరిగిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. నేటి తరం పిల్లలకు విదేశీ సూపర్‌ హీరోల కంటే మన పురాణాల్లోని గొప్ప వీరుల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మ్యాన్, ఐరన్‌మ్యాన్ వంటి పాత్రల కంటే మన హనుమంతుడు, అర్జునుడు వంటి వారు ఎంతో గొప్పవారని ఆయన గుర్తు చేశారు. శ్రీరాముడి వంటి ఉత్తమ పురుషుడు లోకంలోనే లేరని, రామరాజ్యం గురించి నేటి పిల్లలకు వివరించడం మన బాధ్యత అని ఆయన అన్నారు.

గతంలో ప్రజలు పురాణాలను మర్చిపోతున్న తరుణంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) గారు పౌరాణిక చిత్రాల ద్వారా మన సంస్కృతిని మళ్ళీ ప్రజలకు దగ్గర చేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా, రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ విలువలను కాపాడారని ప్రశంసించారు. అలాగే, దేశాభివృద్ధి కోసం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.

2047 నాటికి విశ్వగురువుగా భారత్
భారతదేశ భవిష్యత్తుపై చంద్రబాబు నాయుడు ఎంతో ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ స్థిరమైన ప్రగతిని సాధిస్తోందని, 2038 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ప్రపంచ శక్తిగా మన దేశం ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను హైదరాబాద్‌లో ఐటీని ప్రోత్సహించడం వల్ల నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు అత్యధిక జీతాలు పొందుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్, విశాఖలో గూగుల్ పెట్టుబడులు, తిరుపతిలో స్పేస్ సిటీ వంటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని టెక్నాలజీ కేంద్రంగా మారుస్తున్నట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *