Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా చేదువార్తే. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు చుక్కలను చూపిస్తున్నాయి. సోమవారం నుంచి ఏకధాటిగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు, శుక్రవారం నాడు మరోసారి పెరిగి సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. పండుగల సీజన్ కావడంతో డిమాండ్ పెరగడం, అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు వెరసి.. ధరలు అదుపు లేకుండా ఆకాశాన్నంటుతున్నాయి. ఎప్పుడు ధర తగ్గుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న సామాన్యులకు ఈ పెరుగుదల గట్టి షాక్ ఇచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలను గమనిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,39,260 వద్ద కొనసాగుతోంది. అలాగే, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,27,660 కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,39,410 గా ఉండగా, చెన్నైలో అత్యధికంగా రూ. 1,39,870 పలుకుతోంది.
బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఒక్కరోజులోనే వెండి ధరలు వేలల్లో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర ఏకంగా రూ. 2,45,100 కు చేరింది. అటు బెంగళూరులో కూడా వెండి ధరలు భారీగానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరంగా లేకపోవడం వల్లే దేశీయంగా కూడా ఈ స్థాయిలో రేట్లు పెరుగుతున్నాయని నిపుణులు చెపుతున్నారు.
పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటం, పండుగల వేళ బంగారం కొనడం సెంటిమెంట్‌గా ఉండటంతో ధరలు పెరిగినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. అయితే, పెట్టుబడిదారులు మాత్రం గోల్డ్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలు సామాన్యులను కలవరపెడుతున్నాయి.
