GHMC: హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పునర్విభజన ప్రక్రియకు సంబంధించి తుది నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ జీవో 292ను జారీ చేసింది. ఈ కీలక నిర్ణయంతో ఇన్నాళ్లూ కేవలం ఆరు జోన్లు, 30 సర్కిళ్లుగా ఉన్న నగర పరిధి ఇప్పుడు రెట్టింపు అయింది. కొత్తగా ఏర్పడిన 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లతో కూడిన ‘మహా హైదరాబాద్’ ఇప్పుడు 2053 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది.
నగర విస్తరణలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు అవతలి వరకు ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేశారు. గతంలో 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నగరాన్ని, పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌గా మార్చారు. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా వచ్చిన సుమారు 6 వేల అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ తుది నోటిఫికేషన్‌ను ఖరారు చేసింది. దీని ప్రకారం శంషాబాద్, గోల్కొండ, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ ప్రాంతాలు కొత్త జోన్లుగా అవతరించాయి. వార్డుల సరిహద్దుల వివరాలను ప్రజల సౌకర్యార్థం జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌తో పాటు కార్యాలయాల నోటీసు బోర్డుల్లో కూడా అందుబాటులో ఉంచారు.
Also Read: Telangana: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు..
ఈ భారీ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీలను కూడా వేగవంతం చేసింది. కొత్తగా ఏర్పడిన జోన్లకు పాలనా సౌలభ్యం కోసం ప్రత్యేక కమిషనర్లను నియమించింది. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా హేమంత్ సహదేవ్, కూకట్‌పల్లికి అపూర్వ చౌహాన్, కుత్బుల్లాపూర్‌కు సందీప్ కుమార్, చార్మినార్‌కు ఎస్.శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే జయేశ్ రంజన్‌ను మెట్రోపాలిటన్ ఏరియా & అర్బన్ డెవలప్‌మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించగా, టీజీపీఎస్సీ కార్యదర్శిగా ఎం.హరిత, మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా నర్సింహారెడ్డి నియమితులయ్యారు. ఈ పునర్విభజన ద్వారా పౌర సేవలు ప్రజలకు మరింత చేరువ కావడమే కాకుండా, నగరం అంతటా సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
