Encounter: ఒడిశా రాష్ట్రంలోని కందమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతం ఒక్కసారిగా తుపాకుల మోతతో దద్దరిల్లింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన హోరాహోరీ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరణించిన వారిలో మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు (అలియాస్ గణేష్) ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఆయన తలపై ప్రభుత్వం ఏకంగా రూ. 1.10 కోట్ల భారీ రివార్డు ప్రకటించిందంటే, పార్టీలో ఆయన ప్రాధాన్యత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
హనుమంతు నేపథ్యాన్ని గమనిస్తే, ఆయనది తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామం. పాక చంద్రయ్య, పాపమ్మ దంపతులకు 1961లో జన్మించిన ఆరుగురు సంతానంలో ఈయనే పెద్దవారు. చిన్నతనం నుంచే తండ్రి ప్రభావంతో కమ్యూనిస్టు భావజాలం పట్ల ఆకర్షితుడయ్యారు. నల్గొండలో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ‘రాడికల్ స్టూడెంట్ యూనియన్’లో చురుగ్గా పనిచేశారు. దాదాపు 45 ఏళ్ల క్రితం జరిగిన ఒక హత్య కేసు తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుండి తిరిగి ఇంటికి రాలేదు, కనీసం తల్లిదండ్రులు మరణించినప్పుడు కూడా వారిని కడసారి చూసేందుకు రాలేకపోయారు.
గత నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న హనుమంతు, పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. మండల స్థాయి నుంచి మొదలై, మూడు రాష్ట్రాల బాధ్యతలు చూసే కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు బలగాలు గాలింపు చర్యలను మరింత ఉధృతం చేశాయి.
