Brahmanandam: తెలుగు సినిమా వెండితెరపై నవ్వుల పూలు పూయించిన ‘హాస్య బ్రహ్మ’ డాక్టర్ బ్రహ్మానందం తాజాగా వార్తల్లో నిలిచారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనలో భాగంగా, బ్రహ్మానందం ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన ఈ భేటీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
కళాకారుడికి గౌరవం.. రాష్ట్రపతి సత్కారం
ఈ సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్రహ్మానందాన్ని సాదరంగా ఆహ్వానించారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషిని అభినందిస్తూ, పుష్పగుచ్ఛం అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు.
ప్రత్యేక ఆకర్షణగా ‘పెన్సిల్ ఆర్ట్’
బ్రహ్మానందం కేవలం నటుడే కాదు, అద్భుతమైన చిత్రకారుడన్న విషయం మనందరికీ తెలిసిందే. తనలోని ఆ కళా హృదయాన్ని మరోసారి చాటుకుంటూ, తాను స్వయంగా గీసిన ఆంజనేయ స్వామి పెన్సిల్ స్కెచ్‌ను రాష్ట్రపతికి బహుమతిగా అందించారు.
ఇది కూడా చదవండి: Samantha: హీరోయిన్ సమంతకు చేదు అనుభవం
సూక్ష్మమైన వివరాలతో ఎంతో భక్తిభావంతో రూపొందించిన ఈ చిత్రం రాష్ట్రపతిని ఎంతగానో ఆకట్టుకుంది. గతంలోనూ ఆయన కృష్ణంరాజు, రామ్ చరణ్ వంటి ప్రముఖులకు ఇలాంటి చిత్రాలను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచారు.
గిన్నిస్ రికార్డ్ నుండి మీమ్స్ వరకు..
బ్రహ్మానందం పేరు వినపడగానే ప్రతి తెలుగువాడి ముఖంపై నవ్వు విరుస్తుంది. అహనా పెళ్లంట తో మొదలైన ప్రయాణం వెయ్యికి పైగా సినిమాల వరకు సాగింది. అత్యధిక సినిమాల్లో నటించిన నటుడిగా 2010లో గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. నేటి సోషల్ మీడియా యుగంలో ఆయన లేని మీమ్ లేదు, ఆయన ఎక్స్ప్రెషన్ లేని ట్రోల్ లేదు. అంతలా యువతకు కూడా దగ్గరయ్యారు..
తగ్గేదేలే.. అప్పుడప్పుడు స్పెషల్ అప్పియరెన్స్!
వయోభారంతో గత కొన్నాళ్లుగా సినిమాల సంఖ్య తగ్గించిన బ్రహ్మానందం, తనకు నచ్చిన వైవిధ్యమైన పాత్రలను మాత్రమే చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమాలో ఆయన పోషించిన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. కేవలం నవ్వులు పూయించడమే కాదు, వ్యక్తిత్వంలోనూ ఎంతో హుందాగా ఉండే బ్రహ్మానందం రాష్ట్రపతిని కలవడం ఆయన సినీ ప్రస్థానంలో మరో గౌరవ ఘట్టంగా నిలిచిపోతుంది.
