Bharat Future City: హైదరాబాద్ అంటే కేవలం భాగ్యనగరం మాత్రమే కాదు.. రేపటి తరం ఆధునికతకు చిరునామా అని చాటిచెప్పేలా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సింగపూర్‌కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఈ మెగా ప్రాజెక్టుకు తుది మెరుగులు దిద్దుతుండగా, దాదాపు 30 వేల ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఒక అద్భుత నగరం ఆవిష్కృతం కాబోతోంది.
1. మాస్టర్ ప్లాన్: రెండు భాగాలుగా 30 వేల ఎకరాలు
ఈ ఫ్యూచర్ సిటీని పక్కాగా రెండు విభాగాలుగా విభజించారు.
-
కోర్ సిటీ (15 వేల ఎకరాలు): ఇక్కడ నివాసాలు, ఐటీ సంస్థలు, వాణిజ్య సముదాయాలు ఉంటాయి.
-
అర్బన్ ఫారెస్ట్ (15 వేల ఎకరాలు): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సగం భూమిని అడవికి, ఎకో-టూరిజంకు కేటాయించారు. ముచ్చర్ల, మీర్‌ఖాన్ పేట, పందుగుల, కందుకూరు గ్రామాల పరిధిలో విస్తరించనున్న ఈ సిటీలో రోడ్ల వెడల్పు నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వరకు అన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో ‘నెట్ జీరో’ (కార్బన్ ఉద్గారాలు లేని) లక్ష్యంతో నిర్మిస్తున్నారు.
2. ముచ్చర్ల: ఏఐ సిటీ & స్కై స్క్రాపర్ల హబ్
న్యూయార్క్, దుబాయ్ నగరాలను తలపించేలా ముచ్చర్ల ప్రాంతం ఫ్యూచర్ సిటీకి గుండెకాయలా మారనుంది.
-
స్కై స్క్రాపర్లు: ఎత్తైన గుట్టలు ఉన్నందున ఇక్కడ భారీ ఆకాశహర్మ్యాల నిర్మాణానికి మొగ్గు చూపుతున్నారు.
-
టెక్ జెయింట్స్: అమెజాన్, గూగుల్ వంటి సంస్థల డేటా సెంటర్లతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్ ఇక్కడే కొలువుదీరనుంది.
-
గ్రీన్ ఫార్మా: కాలుష్య రహిత ‘జీరో లిక్విడ్ డిశ్చార్జ్’ విధానంతో నడిచే గ్రీన్ ఫార్మా క్లస్టర్లను నివాస ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేస్తున్నారు.
3. నాలెడ్జ్ వ్యాలీ & ఎడ్యుకేషన్ హబ్
మీర్‌ఖాన్ పేట ప్రాంతం విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయనుంది. ఇప్పటికే ఇక్కడ ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ కి పునాది పడింది. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీల క్యాంపస్‌లు, పరిశోధనా కేంద్రాలు, సహజ సిద్ధమైన చెరువుల ఒడ్డున లైబ్రరీలతో ఈ ప్రాంతం ఒక విద్యా విజ్ఞాన కేంద్రంగా విరాజిల్లనుంది.
ఇది కూడా చదవండి: Tragedy Love Story: ప్రేమించి పెళ్లి చేసుకుంటే ప్రాణం తీశారు.. తాండూరులో నవవధువు అనుమానాస్పద మృతి!
4. హెల్త్ అండ్ స్పోర్ట్స్: ఆరోగ్యం.. ఆనందం
-
హెల్త్ సిటీ: అటవీ సరిహద్దులకు ఆనుకొని ‘హెల్త్ టూరిజం’ జోన్‌ను ప్లాన్ చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు ప్రకృతి ఒడిలో యోగా, వెల్‌నెస్ రిసార్ట్స్ ఇక్కడ ప్రత్యేకం.
-
స్పోర్ట్స్ విలేజ్: 3 వేల ఎకరాల్లో ఒలింపిక్ స్థాయి క్రీడా గ్రామాన్ని నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ఫుట్‌బాల్, టెన్నిస్ కోర్టులు ఇక్కడ రానున్నాయి. భవిష్యత్తులో ఏషియన్ గేమ్స్ వంటివి నిర్వహిస్తే ఫ్యూచర్ సిటీనే వేదిక కానుంది.
5. ఎకో-టూరిజం & వినోదం
నగరవాసులు వీకెండ్ ఎంజాయ్ చేసేలా నైట్ సఫారీలు, ట్రెక్కింగ్ ట్రాక్‌లు, సైక్లింగ్ జోన్లు రాబోతున్నాయి. హాలీవుడ్ తరహాలో భారీ ఫిల్మ్ స్టూడియోలు, వీఎఫ్ఎక్స్ హబ్‌లను ‘బ్లూ-గ్రీన్ నెట్‌వర్క్’ (నీరు మరియు పచ్చదనం) కాన్సెప్ట్‌తో డిజైన్ చేస్తున్నారు.
6. మెట్రో కనెక్టివిటీ.. గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ముచ్చర్ల వరకు నేరుగా మెట్రో రైలు సౌకర్యం ఉండబోతోంది. తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి 300 అడుగుల రోడ్డు నేరుగా ఏఐ సిటీని కలుపుతుంది. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్, పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ బస్సులు, పాడ్ టాక్సీలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
అవినీతికి తావులేకుండా గ్లోబల్ టెండర్ల ద్వారా అత్యున్నత ప్రమాణాలతో ఈ నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఐటీ, విద్య, ఆరోగ్యం, క్రీడలు, పర్యావరణం.. ఇలా అన్ని రంగాల మేళవింపుగా రాబోతున్న ఈ ‘ఫ్యూచర్ సిటీ’ తెలంగాణ గర్వించదగ్గ మైలురాయిగా నిలవబోతోంది.
