CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజుల పాటు సాగే జిల్లా కలెక్టర్ల సదస్సు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండాగా సాగుతున్న ఈ ఐదవ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో బాధ్యత, జవాబుదారీతనం చాలా ముఖ్యమని, మనం చేసే ప్రతి పని ప్రజల్లో సంతృప్తి కలగాలని ఆయన సూచించారు. అధికారులు కేవలం కష్టపడి పనిచేయడం (హార్డ్ వర్క్) మాత్రమే కాకుండా, టెక్నాలజీను జోడించి స్మార్ట్ వర్క్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) వృద్ధి రేటు, పేదరిక నిర్మూలనకు ఉద్దేశించిన ‘పీ-4’ (P-4) విధానంపై సుదీర్ఘంగా చర్చించారు. ఒకప్పుడు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ గురించి మాట్లాడేవాళ్లమని, కానీ ఇప్పుడు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వైపు అడుగులు వేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ఎటువంటి జాప్యం లేకుండా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. అలాగే, ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో ‘ఈ-ఆఫీస్’ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ఏ సమస్యకైనా సత్వర పరిష్కారం చూపేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని తెలిపారు.
Also Read: APSRTC: ఇకపై వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్
ప్రభుత్వ సంక్షేమ పథకాలైన సూపర్ సిక్స్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాల అమలులో కలెక్టర్ల పాత్ర అత్యంత కీలకమని సీఎం గుర్తు చేశారు. పేదలకు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు అందించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని ఆయన కొనియాడారు. మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను అధిగమించి నిరుద్యోగులకు న్యాయం చేశామని, ప్రభుత్వ అధికారాలను ప్రజల సద్వినియోగం కోసమే వాడాలని ఆయన హితవు పలికారు.
మెడికల్ కాలేజీల నిర్వహణపై వస్తున్న తప్పుడు ప్రచారాలను చంద్రబాబు ఖండించారు. కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయని, కేవలం కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించేందుకే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) మోడల్‌ను పరిశీలిస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం వృధా చేసిన రూ.500 కోట్ల నిధులను మెడికల్ కాలేజీలకు ఖర్చు చేసి ఉంటే ఈపాటికి ఫలితం ఉండేదని రుషికొండ ప్యాలెస్ ప్రస్తావిస్తూ విమర్శించారు. అధికారులందరూ నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, కేంద్ర పథకాలను అందిపుచ్చుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సీఎం ఆకాంక్షించారు.
