Minister tummala: రాష్ట్రంలో యూరియా అక్రమ రవాణా, బ్లాక్ మార్కెట్‌కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే యూరియా కొనుగోళ్ల కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ యాప్ ద్వారా యూరియా నేరుగా రైతులకే చేరేలా పక్కా వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు.
మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ, యూరియా పరిశ్రమలకు లేదా అక్రమ మార్గాల్లోకి మళ్లకుండా అడ్డుకునేందుకు ఈ యాప్ కీలకంగా ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే పత్తి అమ్మకాల కోసం ప్రవేశపెట్టిన ‘కపాస్ కిసాన్’ యాప్ వంద శాతం విజయవంతమైందని, అదే తరహాలో యూరియా యాప్‌ను కూడా రూపొందిస్తున్నామని చెప్పారు.
ఈ యాప్ రూపకల్పనపై రైతు వేదికల ద్వారా రైతుల అభిప్రాయాలు సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, స్లాట్ బుకింగ్ వంటి అంశాల్లో రైతులకు సహాయం అందించేందుకు రైతు వేదికల వద్ద ఏఈవోలు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. కొందరు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అదే సమయంలో పంటల సర్వే విషయంలో కూడా ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు తుమ్మల తెలిపారు. శాటిలైట్ టెక్నాలజీ ద్వారా పంటల సర్వే నిర్వహించేందుకు జర్మనీకి చెందిన ఒక సంస్థతో చర్చలు తుది దశకు చేరుకున్నాయని చెప్పారు. ఈ ఒప్పందం పూర్తయితే, వాస్తవంగా పంట సాగు చేసిన భూమికే ‘రైతు భరోసా’ సహాయం అందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
సాగు చేయని కొండలు, గుట్టలు వటి భూములకు రైతు భరోసా నిలిపివేసి, ఆ నిధులను ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు మళ్లిస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై త్వరలో కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
