VC Sajjanar: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, వారిని అనాథలుగా వదిలేయడం ఏ మాత్రం సరికాదని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనలను తాను స్వయంగా చాలాసార్లు చూశానని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
తల్లిదండ్రులను బాగా చూసుకోవడం, వారి బాగోగులు పట్టించుకోవడం బిడ్డల కనీస ధర్మం అని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి సాకులు చెప్పినా, తమని తాము సమర్థించుకున్నా పోలీసులు అంగీకరించరని ఆయన తేల్చి చెప్పారు. ఈ సందేశాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఆయన ఒక వీడియోను కూడా విడుదల చేశారు.
Also Read: Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీలు.. కేంద్ర మంత్రులతో చర్చలు
వీసీ సజ్జనార్ పిల్లలకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోమని చెప్పారు “ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తారో, రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి అదే పాఠం నేర్చుకుంటారు.” కాబట్టి, వృద్ధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నా, వారిని హింసించినా ఆ విషయాలను అస్సలు ఉపేక్షించేది లేదు అని ఆయన కఠినంగా చెప్పారు. తమ కన్నవారిని రోడ్డుపై వదిలేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని హెచ్చరించారు.
ఎవరైనా వృద్ధులు లేదా తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో ఉండి, తమ బాధను ఎవరూ పట్టించుకోవడం లేదని భావిస్తే, పోలీసు శాఖ వారికి అండగా నిలుస్తుంది అని సీపీ భరోసా ఇచ్చారు. అలాంటి బాధితులు ఏమాత్రం భయపడకుండా నిర్భయంగా నేరుగా పోలీసులను సంప్రదించవచ్చు అని వీసీ సజ్జనార్ ప్రజలకు వివరించారు.
