Kavitha

Kavitha: కవిత సవాల్.. నేను సీఎం అయితే మీ లెక్కలు తేలుస్తా!

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గట్టి హెచ్చరిక చేశారు. నాకు కూడా సమయం వస్తుంది, నేను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాను అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అయితే, 2014 సంవత్సరం నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల తనపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు కూడా పంపుతానని కవిత హెచ్చరించారు.

కవిత మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకుల అవినీతి గురించి తాను ఇంకా పూర్తిగా మాట్లాడలేదన్నారు. ఇది కేవలం ‘టాస్’ మాత్రమే. దీనికే ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? త్వరలోనే మీ అవినీతి, అక్రమాలపై ‘టెస్ట్ మ్యాచ్’ ఉండబోతోంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకుల అవినీతిని తనపై రుద్దే ప్రయత్నం చేయవద్దని, అలా తప్పుడు ఆరోపణలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోనని, ఒక్కొక్కరి తోలు తీస్తా అంటూ కవిత తీవ్రంగా మండిపడ్డారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల గురించి కూడా కవిత ప్రస్తావించారు. హిల్ట్ (HILT) పాలసీకి దారులు తెరిచింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. గతంలో బీఆర్ఎస్ దారి వేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రహదారులు వేస్తోంది అని ఆమె ఆరోపించారు. కేటీఆర్ హయాంలో కొన్ని చెరువులను ప్రైవేట్ బిల్డర్లకు అభివృద్ధి కోసం ఇచ్చారని, అందులో ఉస్మాన్ కుంట చెరువును ప్రణీత్ బిల్డర్స్‌కు ఇచ్చారని వివరించారు. ఈ ప్రణీత్ బిల్డర్స్‌లో మాధవరం కృష్ణారావు కొడుకు డైరెక్టర్ గా ఉన్నారని తెలిపారు. మాధవరం కృష్ణారావు వెనుక ఉన్న గుంట నక్కను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని కవిత తేల్చి చెప్పారు.

ఈ పదేళ్లలో తాను కానీ, తన భర్త కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదని కవిత గట్టిగా నొక్కి చెప్పారు. నా నగలు కుదువ పెట్టి బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించాను అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీకు దమ్ముంటే, నేను మీపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పండి. పనికి మాలిన చేష్టలు చేస్తే చూస్తూ ఊరుకోను అని హెచ్చరించారు. అంతేకాదు, తాను హరీశ్ రావుపై ఆరోపణలు చేస్తే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారని కూడా కవిత ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *