Veerabrahmendra Swamy: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్.టి.రామారావు నటజీవితంలో ఎన్నెన్నో మరపురాని చిత్రాలు… వాటిలో ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ ప్రత్యేక స్థానం సంపాదించింది… నవంబర్ 29న ‘బ్రహ్మంగారి చరిత్ర’ చిత్రం నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది… ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను మననం చేసుకుందాం.
తెలుగునేలపై సంఘసంస్కర్తలుగా నిలిచారు ఎందరో మహానుభావులు… వారిలో మూఢనమ్మకాలను విమర్శిస్తూ, కాలజ్ఞానం చెప్పిన ఘనుడు వీరబ్రహ్మేంద్రస్వామి… ఆయన గాథను అపూర్వంగా తెరకెక్కించారు నటరత్న… యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ నలభై ఏళ్ళ క్రితం నిజంగానే చరిత్ర సృష్టించింది.
Veerabrahmendra Swamy: మాతృభాష తెలుగంటే ప్రాణం పెట్టే నటరత్న యన్టీఆర్ మొదటి నుంచీ తెలుగువారి ఘనతను లోకానికి చాటాలని తపించేవారు… ఆ ప్రయత్నంలోనే 1955లో విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు కథను తెరకెక్కించాలని ప్రయత్నించారు… నటునిగా తీరికలేకుండా సాగడంతో ఎందువల్లో అది కార్యరూపం దాల్చలేదు… ఆ తరువాత తెలుగునాట చెరిగిపోని చరిత్రను సొంతం చేసుకున్న శ్రీకృష్ణదేవరాయలు, పల్నాటి బ్రహ్మనాయుడు, బొబ్బిలి రంగనాయుడు వంటి పాత్రల్లో నటించి ఎంతగానో మెప్పించారు… అదే తీరున తెలుగునాట సంఘంలోని దురాచారాలను ఎండగట్టిన వేమన, వీరబ్రహ్మేంద్రస్వామి పాత్రలనూ పోషించాలని తపించారు… ఆ తపనలోనే బ్రహ్మంగారిపై పరిశోధన సాగించారు… బ్రహ్మంగారి గొప్పతనం తెలుసుకున్న యన్టీఆర్ ఆ పాత్రను ఆకళింపు చేసుకొని నటించిన తీరు నభూతో నభవిష్యతి అనిపించుకుంది.
తెలుగునాట భవిష్యవాణి వినిపిస్తూ తన తత్త్వాలతో జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు బ్రహ్మంగారు… ఆయనను జనం అభిమానంగా ‘బ్రహ్మం తాత’ అని కూడా పిలుచుకొనేవారు… ఆయన చెప్పిన అనేక విషయాలు తరువాతి రోజుల్లో నిజమయ్యాయి… అందువల్లే బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఈ నాటికీ జనం నెమరు వేసుకుంటూనే ఉన్నారు… యన్టీఆర్ 1969లోనే బ్రహ్మంగారి గొప్పతనాన్ని తెలుసుకొని పరవశించి పోయారు… తాను దర్శకత్వం వహించి నటించిన ‘తల్లా-పెళ్ళామా’ చిత్రంలో సందర్భోచితంగా బ్రహ్మంగారిపై ఓ పాటను రూపొందించారు యన్టీఆర్… జానపద కవిబ్రహ్మగా పేరొందిన కొసరాజు రాసిన ‘బ్రహ్మం తాత చెప్పింది…’ అంటూ సాగే ఆ పాట 1970లలో మారుమోగి పోయింది… ఈ పాటను తన తనయుడు హరికృష్ణపై చిత్రీకరించారు యన్టీఆర్.
Veerabrahmendra Swamy: నటరత్న యన్టీఆర్ సూపర్ స్టార్ అయ్యాక ఆయన కెరీర్ లో మందకొడిగా సాగిన సంవత్సరం 1972 అనే చెప్పాలి… ఆ యేడాది యన్టీఆర్ కేవలం మూడు చిత్రాల్లోనే నటించారు… 1973 నుండి మళ్ళీ రామారావు నటనావైభవం జైత్రయాత్ర చేస్తూ సాగింది… ఆ సమయంలో 1981లో యన్టీఆర్ మనసులో బ్రహ్మంగారి చరిత్ర రూపొందించాలన్న తపన పెరిగింది… యన్టీఆర్ రూపొందించిన అపురూప పౌరాణిక చిత్రం ‘దానవీరశూర కర్ణ’కు రచన చేసిన కొండవీటి వేంకటకవితోనే ‘బ్రహ్మంగారి చరిత్ర’ స్క్రిప్ట్ సిద్ధం చేయించారు… అలాగే కొసరాజు కూడా తగిన విధంగా బ్రహ్మంగారి తత్వాలను ఏర్చి కూర్చారు… బ్రహ్మంగారి చరిత్రను స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించారు రామారావు… బ్రహ్మంగారి పాత్రలో యన్టీఆర్ జీవించారనే చెప్పాలి.
‘తెరమీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారం చెలాయించేను’ అంటూ బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు… తరువాతి రోజుల్లో అది నిజమయింది… అంతకు ముందు కొందరు నటులు రాజకీయాల్లో పాలుపంచుకుని విజయం సాధించారు… యమ్జీఆర్, రోనాల్డ్ రీగన్ వంటి నటులు అధికారం చెలాయించారు… చిత్రమేమిటంటే – ‘బ్రహ్మంగారి చరిత్ర’ను తెరకెక్కించిన యన్టీఆర్ సైతం తరువాతి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చివేసి అధికారం చేపట్టారు… అలా బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమయిందని 1984లో ఈ సినిమా విడుదలయినప్పుడు జనం పదే పదే ముచ్చటించుకున్నారు… ఇప్పటికీ ‘బ్రహ్మంగారి చరిత్ర’ను బుల్లితెరపై చూస్తున్నప్పుడు తెలుగువారు అదే తీరున ముచ్చటించుకోవడం విశేషం!
Veerabrahmendra Swamy: బ్రహ్మంగారు సంఘంలోని దురాచారాలను ఎండగట్టారు… ఆయన బోధనలు విని ఎందరో ఆయనకు శిష్యులుగా మారిపోయారు… కులమతాలకు అతీతంగా బ్రహ్మంగారు జనులను ఆదరించారు… పండితులమని విర్రవీగేవారికి తగిన బుద్ధి చెప్పారు… ఈ అంశాలను ఒక్కొక్కటి వివరిస్తూనే ‘బ్రహ్మంగారి చరిత్ర’ చిత్రాన్ని రూపొందించారు యన్టీఆర్.
బ్రహ్మంగారు సంఘసంస్కర్తనే కాదు, బాల్యం నుంచీ తపోశక్తితో విజ్ఞానశాస్త్రాన్ని కూడా బోధించారు… భవిష్యత్ లో భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో జరగబోయే విషయాలనూ వివరించారు… తరువాతి కాలంలో మనం చూస్తూండగా కూడా బ్రహ్మంగారు చెప్పిన అంశాలు కొన్ని జరిగాయి… బాల్యంలోనే తనను పెంచిన తల్లికి జీవితసత్యాన్ని బోధించిన మహాజ్ఞాని బ్రహ్మంగారు అని తెలుగునేలపై విశేషంగా చర్చించుకుంటారు… అదే తీరున చిత్రంలోనూ బాలుడైన బ్రహ్మం మనిషి పుట్టుకను గురించి చాటిన విధం జనాన్ని భలేగా ఆకట్టుకుంది.
Veerabrahmendra Swamy: వీరబ్రహ్మేంద్రస్వామి యోగశాస్త్రాన్ని సైతం జనానికి అర్థమయ్యేలా వివరించారు… పుట్టిన ప్రతీ జీవి గిట్టక మానదు…అయితే పుట్టిన తరువాత ఆ పరమాత్మను చేరుకోవడానికి ఎలాంటి సాధన చేయాలో పూసగుచ్చినట్టు చెప్పారు… పరమాత్మను చేరుకొనే నవవిధ భక్తిలో ఎలా సాగాలో తెలిపారు… పరమాత్మను చేరుకోవడానికి ప్రాణాయామం కూడా ఓ సాధన అని వివరించారు… మనలోని కుండలినీ శక్తిని నిద్రలేపడానికి తగిన దారి చూపించారు… మనలో ఆరు చక్రాలున్నాయనీ, వాటిలో ఎలా ప్రయాణించాలో తెలిపారు… ఈ అంశాలన్నిటినీ ‘బ్రహ్మంగారి చరిత్ర’లో సామాన్య జనానికి అర్థమయ్యేలాగే తెరకెక్కించారు యన్టీఆర్.
తత్త్వవేత్తలందరూ సంఘంలోని చెడును కడిగేయాలనే తపించారు… బ్రహ్మంగారు సైతం అదే తీరున సాగారు… తన తత్వాలతో సామాన్య జనానికి అర్థమయ్యేలా జీవితాన్ని ఎలా మలచుకోవాలో బోధించారు… కడవరకూ తన బోధతో ప్రజలను ప్రతిభావంతులుగా మార్చడానికే తపించారు బ్రహ్మం తాత… పదే పదే సన్మార్గంలో నడవాలని చాటి చెప్పారు… ఆ సన్నివేశాలను పాటలతోనే రక్తి కట్టించారు రామారావు.
Veerabrahmendra Swamy: బ్రహ్మంగారు తన బోధనలతో తెలుగునేలను పావనం చేశారు… జనాల్లో మళ్ళీ మార్పు రావాలన్న సమయం ఆసన్నమైనప్పుడు ‘వీరభోగ వసంతరాయలు’గా మళ్ళీ వస్తాననీ తెలిపారు… కడప జిల్లా కందిమల్లయ్య పల్లిలో బ్రహ్మంగారు జీవసమాధి అయ్యారు… ఆ ప్రదేశం ప్రస్తుతం ఓ పుణ్యక్షేత్రంగా భక్తుల పూజలు అందుకుంటోంది… అందుకే బ్రహ్మంగారి పేరు వినగానే ఆయన బోధించిన తత్వాలు చప్పున గుర్తుకు వస్తాయి… అదే తీరున యన్టీఆర్ తెరకెక్కించిన ‘బ్రహ్మంగారి చరిత్ర’ చిత్రం కూడా మనవాళ్ళ మదిలో మెదలుతుంది.
వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ను తెరకెక్కించి తరిగిపోని చెరిగిపోని చరిత్రను సొంతం చేసుకున్నారు యన్టీఆర్… ఈ సినిమా ఆరంభం- పూర్తి కావడం- అయిన తరువాత సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కోవడం – అన్నీ కూడా చరిత్రగానే నిలిచాయి…
Veerabrahmendra Swamy: యన్టీఆర్ నటజీవితంలో 1976 నుండి 1982 వరకు ఓ మరపురాని మరచిపోలేని చరిత్ర అనే చెప్పాలి… వరుసగా ఘనవిజయాలను చూడడమే కాదు, అదే సమయంలోనే బ్రహ్మంగారి చరిత్రను రూపొందించాలనే తపనతో సాగారు… 1981లో బ్రహ్మంగారి చరిత్రను రూపొందించాలని యన్టీఆర్ అందుకు తగ్గట్టుగా వీరబ్రహ్మేంద్రస్వామి నడయాడిన ప్రదేశాలను సందర్శించారు… ఈ నేపథ్యంలో రాయలసీమలో యన్టీఆర్ పర్యటిస్తున్న సమయంలో జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు… బ్రహ్మంగారి మఠంలో ఉన్న ఆయన పాదుకలను యన్టీఆర్ ధరించగానే సరిగా సరిపోయాయి… అప్పుడే జనం బ్రహ్మంగారి పాత్ర కోసమే యన్టీఆర్ జన్మించారని కొనియాడారు.
‘బ్రహ్మంగారి చరిత్ర’ సినిమా షూటింగ్ రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సాగింది… అహోబిళం నరసింహస్వామి దేవాలయం ముందు భాగంలోనూ చిత్రీకరణ జరుపుకుంది…ఆ సమయంలో ప్రతిరోజూ యన్టీఆర్ ను చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు… వారి ఆశీస్సులతోనే ‘బ్రహ్మంగారి చరిత్ర’ను పూర్తి చేశామనీ రామారావు పేర్కొన్నారు.
Veerabrahmendra Swamy: ‘బ్రహ్మంగారి చరిత్ర’ సినిమా షూటింగ్ పూర్తయ్యాక సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంది… అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యన్టీఆర్ పై కక్ష కట్టి అలా ప్రవర్తించిందనీ జనం చర్చించుకున్నారు… సెన్సార్ ప్రతిపాదించిన కట్స్ ను నిర్మాత, దర్శకుడు కూడా అయిన యన్టీఆర్ అంగీకరించలేదు… సెన్సార్ వారు పట్టుబట్టడంతో యన్టీఆర్ కోర్టును ఆశ్రయించారు… అలా ‘బ్రహ్మంగారి చరిత్ర’కు సెన్సార్ కష్టాలు ఎదురయ్యాయి… వాటిని విజయవంతంగా ఎదుర్కొని ‘బ్రహ్మంగారి చరిత్ర’ బయట పడింది.
‘బ్రహ్మంగారి చరిత్ర’ జనం ముందుకు రాకముందే యన్టీఆర్ 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు… ఆ తరువాత ప్రచార నిమిత్తమై తెలుగునేలపై చైతన్యరథంలో పయనించారు యన్టీఆర్… ఆ తరువాత రామారావు ఘనవిజయం సాధించడం, 1983లో ముఖ్యమంత్రి కావడం- ఆ పై 1984లో బర్తరఫ్ జరగడం, మళ్ళీ నెల రోజులకే అధికారం చేపట్టడం అన్నీ జరిగిపోయాయి… ఈ కాలంలోనే నటరత్న నటవారసుడిగా బాలకృష్ణ అడుగు పెట్టారు… ‘బ్రహ్మంగారి చరిత్ర’లో బాలకృష్ణ సిద్ధయ్య పాత్రలో నటించి అలరించారు… ఈ సినిమా విడుదల నాటికి ‘మంగమ్మగారి మనవడు’ ఘనవిజయంతో బాలకృష్ణ స్టార్ హీరో అయ్యారు… దాంతో ‘బ్రహ్మంగారి చరిత్ర’లో బాలయ్య కనిపించగానే జనం ఆనందంతో కేరింతలు కొట్టారు.
Veerabrahmendra Swamy: ‘బ్రహ్మంగారి చరిత్ర’లో బాలకృష్ణకు జోడీగా రతి అగ్నిహోత్రి నటించారు… తండ్రి సరసన నటించిన నాయిక తనయునితోనూ జోడీ కట్టడం అన్నది తెలుగునాట ఈ సినిమాతోనే ఆరంభమయింది… అంతకు ముందు యన్టీఆర్ తో ‘ప్రేమసింహాసనం, తిరుగులేని మనిషి, కలియుగ రాముడు’ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన రతి అగ్నిహోత్రి ఆయన దర్శకత్వంలో బాలయ్యకు జోడీగా నటించి అలరించారు.
‘బ్రహ్మంగారి చరిత్ర’లో మరో కీలకమైన కక్కయ్య పాత్రను సత్యనారాయణ ధరించారు… ఇతర పాత్రల్లో కాంచన, ప్రభ, దేవిక, అన్నపూర్ణ, కృష్ణవేణి, ముక్కామల, మిక్కిలినేని, చలపతిరావు, అల్లు రామలింగయ్య, రాళ్ళపల్లి, పి.జె.శర్మ, చిట్టిబాబు వంటివారు నటించారు… అందరికీ ‘బ్రహ్మంగారి చరిత్ర’లోని పాత్రలు మంచి పేరును సంపాదించి పెట్టాయి… ఈ చిత్రానికి సుసర్ల దక్షిణామూర్తి సంగీతం సమకూర్చారు… ఈ సినిమాలో యన్టీఆర్ కు నేపథ్యగానం చేసిన గాయకుడు రామకృష్ణకు ఎనలేని పేరు లభించింది.
Veerabrahmendra Swamy: యన్టీఆర్ ను 1984 ఆగస్టులో కుట్ర చేసి బర్తరఫ్ చేసిన సమయంలో జనం ఆయన వెన్నంటి నడిచారు… కేవలం నెల రోజుల్లోనే మళ్ళీ యన్టీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు… ప్రపంచంలోనే అరుదైన చరిత్రగా నిలచిన ఈ సంఘటనతో యన్టీఆర్ పై జనాల్లో అభిమానం పెల్లుబికింది… సెప్టెంబర్ 16న తిరిగి ముఖ్యమంత్రిగా యన్టీఆర్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఇందిరాగాంధి హత్య జరిగింది… రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు – ఆయన నేతృత్వంలో 1984 డిసెంబర్ లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి… ఈ నేపథ్యంలోనే 1984 నవంబర్ 29న ‘బ్రహ్మంగారి చరిత్ర’ను ఎలక్షన్ కోడ్ రాకముందే రిలీజ్ చేశారు యన్టీఆర్… తొలి ఆట నుంచే ‘బ్రహ్మంగారి చరిత్ర’ విశేషాదరణ చూరగొంది… దాదాపు విడుదలైన అన్ని కేంద్రాలలో శతదినోత్సవం చూసిందీ చిత్రం… చారిత్రక చిత్రాలలో ఇంతటి ఘనవిజయం సాధించిన సినిమా మరొకటి కానరాదు… 1984 పార్లమెంట్ ఎలక్షన్స్ సమయంలో తెలుగునాట యన్టీఆర్ తెలుగుదేశం పార్టీ 33 సీట్లలో పోటీ చేసి 30 సీట్లు గెలుచుకుంది… ఆ ఘనవిజయంలో ‘బ్రహ్మంగారి చరిత్ర’ ఘనవిజయం పాత్ర కూడా ఉందని చెప్పక తప్పదు.
బహు పాత్రలు పోషించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు యన్టీఆర్… ‘బ్రహ్మంగారి చరిత్ర’లో వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్రలోనే పలు వేరియేషన్స్ చూపించారు… అంతేకాదు, ఇందులో మరో నాలుగు విశేషమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు యన్టీఆర్… మొత్తంగా ఐదు పాత్రల్లో నటించి ‘బ్రహ్మంగారి చరిత్ర’తో అలరించారు రామారావు.
Veerabrahmendra Swamy: ‘బ్రహ్మంగారి చరిత్ర’ నిర్మించే సమయంలో ఉన్న యన్టీఆర్ అర్ధాంగి ఈ సినిమా విడుదల సమయానికి దివంగతులయ్యారు… ఈ చిత్రాన్ని తన భార్య బసవతారకమ్మకు అంకితమిచ్చారు రామారావు… ఇందులో ఆరంభంలోనే బుద్ధునిగా కనిపించి ఆకట్టుకున్నారు నటరత్న.
‘బ్రహ్మంగారి చరిత్ర’లో దర్శకుడైన యన్టీఆర్ క్రమం తప్పారు అనే విమర్శ ఎదుర్కొన్నారు… ఎందుకంటే బుద్ధుని తరువాత నేలపై నడయాడిన ఆదిశంకరాచార్యుని కంటే ముందుగా రామానుజాచార్యుని చూపించారు… నిజానికి శంకరుల తరువాతి వారే రామానుజులు… అందువల్ల చరిత్రకారులు తప్పు పట్టినా, జనం దానిని అంతగా పట్టించుకోలేదు… రామానుజ పాత్రలో రామారావు కనిపించగానే పులకించి పోయారు.
ఆదిశంకరాచార్య పాత్రలోనూ యన్టీఆర్ కాసేపు కనిపించగానే జనం ఆనందించారు… ఆ పాత్ర తెరపై కొన్ని నిమిషాలే దర్శనమిచ్చినా యన్టీఆర్ శంకరాచార్యగా ఒదిగిపోయారని అభిమానులు కొనియాడారు.
Veerabrahmendra Swamy: ‘బ్రహ్మంగారి చరిత్ర’ ఆరంభంలోనే బుద్ధ, రామానుజార్య, శంకరాచార్య పాత్రలు కనిపిస్తాయి… తరువాత ఈ పాత్రల కంటే కాసింత నిడివి ఎక్కువగా వేమన పాత్ర దర్శనమిస్తుంది… నిజానికి ఈ వేమన ఎపిసోడ్ లో ఓ స్త్రీ పాత్రధారి నగ్నం కనిపించడంపై సెన్సార్ కత్తెరకు పనిచెబుతానని అన్నది… ఆ విషయంపైనే యన్టీఆర్ కోర్టులో న్యాయపోరాటం చేశారు… విజయం సాధించారు… ఇక వేమన పాత్రలోనూ నాలుగు రకాల వేరియేషన్స్ చూపించి ఆకట్టుకున్నారు యన్టీఆర్.
బుద్ధ, శంకరాచార్య, రామానుజాచార్య, వేమన బాటలోనే నడచిన విజ్ఞానిగా, సంఘసంస్కర్తగా బ్రహ్మంగారిని చూపించారు యన్టీఆర్… తెలుగువారి మదిలో బ్రహ్మంగారిగా యన్టీఆర్ చెరిగిపోని ముద్రవేశారు… డీ గ్లామర్ రోల్ తో యన్టీఆర్ అరుదైన విజయాన్ని సొంతం చేసుకోవడం మరపురానిది…మరువలేనిది.
నాలుగు పదుల సంవత్సరాలు పూర్తిచేసుకున్న ‘బ్రహ్మంగారి చరిత్ర’ తెలుగువారి మదిలో సదా నిలచే ఉంటుంది… నవతరం సైతం ఈ చిత్ర రాజాన్ని చూసి నేర్చుకోవలసినది ఎంతయినా ఉందని చెప్పవచ్చు.