California

California: కాలిఫోర్నియాలో 30 మంది భారతీయులు అరెస్టు

California: అమెరికాలో అక్రమ వలసలపై చర్యలు మరింత కఠినంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇమిగ్రేషన్ అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పెద్ద సంఖ్యలో అరెస్టులు జరిగాయి. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) వెల్లడించిన వివరాల ప్రకారం, కాలిఫోర్నియాలోని ఇమిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు మొత్తం 49 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 30 మంది భారతీయులు ఉండటం గమనార్హం.

అధికారుల సమాచారం మేరకు, అరెస్టైన వారిలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులు నడుపుతున్నట్లు గుర్తించారు. మరికొందరు సరైన వీసాలు లేదా పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారని తెలిపారు. ఇటీవలి కాలంలో అమెరికాలో జరిగిన పలు ట్రక్కు ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగడంతో, విదేశీ ట్రక్ డ్రైవర్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Also Read: Hyderabad: 1,441 పాఠశాలలను మూసివేస్తున్నట్టు జీ.ఓ విడుదల చేసిన ప్రభుత్వం

ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఇప్పటికే విదేశీ ట్రక్ డ్రైవర్లకు వర్క్ వీసాలు, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసింది. ప్రస్తుతం వాణిజ్య లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులు నడుపుతున్న వలసదారులపై ప్రత్యేక తనిఖీలు చేపడుతోంది. ఈ చర్యల్లో భాగంగా నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగిన ఆపరేషన్‌లో కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులు నడుపుతున్న 42 మంది అక్రమ వలసదారులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 30 మంది భారతీయులు కాగా, మిగిలిన వారు చైనా, మెక్సికో, రష్యా, తుర్కియే వంటి దేశాలకు చెందినవారని CBP వెల్లడించింది.

అదే విధంగా కాలిఫోర్నియాలోని వాణిజ్య ట్రక్కింగ్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన ‘హైవే సెంటినెల్’ ఆపరేషన్‌లో మరో ఏడుగురు అక్రమ వలసదారులను అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 49కు చేరింది. వలస చట్టాల ఉల్లంఘనలను అరికట్టడం, అలాగే దేశంలోని హైవేలు, రవాణా వ్యవస్థ భద్రతను కాపాడడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు. అక్రమ వలసలపై భవిష్యత్తులో కూడా ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *