T20 Cricket: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో జింబాబ్వే జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. పురుషుల టీ20 ప్రపంచకప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో భాగంగా గాంబియాతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఏకంగా 344 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే వంద మార్క్ చేరుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో జింబాబ్వే జట్టును ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చోబెట్టాడు.
సికందరుడి విధ్వంసానికి గాంబియా బౌలర్ల వద్ద సమాధానమే లేకపోయింది. పసికూన గాంబియా బౌలర్లు, ఫీల్డర్లు ప్రేక్షక పాత్ర వహించారు. మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న రజా..15 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 133 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే జింబాబ్వే తరఫున అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
అతనితోపాటు తడివానాశే మారుమణి (62; 19 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), బ్రియాన్ బెన్నెట్ (50; 26 బంతుల్లో), క్లైవ్ మండాడే (53; 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టారు. దీంతో టీ20 క్రికెట్ లో నేపాల్ జట్టు రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన రికార్డు నేపాల్ (314/3) పేరిట ఉండేది. 2023 ఆసియా క్రీడల్లో మంగోలియాపై నేపాల్ ఈ ఫీట్ సాధించింది.