Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడ సిట్ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కాన్వాయ్‌గా ఆయన వెంట బయలుదేరారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు పలు చోట్ల వాహనాలను ఆపి ట్రాఫిక్‌ను నియంత్రించారు.
సిట్ కార్యాలయానికి చేరుకునే ముందు మీడియాతో మాట్లాడిన మిథున్ రెడ్డి, “ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన తప్పుడు కేసు. ఎలాంటి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. కొంతమంది తాత్కాలికంగా రాజకీయ ఆనందం పొందడానికి ఇలాంటి కేసులు పెడుతున్నారు. కానీ ఇది నిలబడే కేసు కాదు” అని తెలిపారు. ఆయనపై ఆరోపణలకు ఎటువంటి భయమూ లేదని, ధైర్యంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. అదేవిధంగా సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని అన్నారు.
లిక్కర్ స్కామ్ కేసులో కొత్త పరిణామాలు
లిక్కర్ స్కామ్ కేసులో సిట్ నిందితుల జాబితాలో మరో పేరు చేర్చబోతోంది. ఇప్పటి వరకు 40 మందిని నిందితులుగా నమోదు చేసిన సిట్ అధికారులు, ఇవాళ కొత్త నిందితుడి పేరును ఏసీబీ కోర్టులో మెమో ద్వారా సమర్పించనున్నారు.
ఇక సిట్ కార్యాలయం వద్ద మిథున్ రెడ్డి విచారణకు సంబంధించి భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రానున్నారనే సమాచారం రావడంతో రూట్‌లో పికెటింగ్, బారికేడ్లను ఏర్పాటు చేశారు.