YS Jagan: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రొయ్యలపై సుంకం పెంచడంతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు ఆగమవుతున్నారు. ఈ సమస్యపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసి, వేగంగా స్పందిస్తే.. మాజీ సీఎం జగన్ మాత్రం దీన్ని రాజకీయంగా బురదజల్లే అవకాశంగా చూశారు. ట్రంప్ నిర్ణయాన్ని చంద్రబాబు తలమీదకు నెట్టి, ‘రైతులను దోచుకుంటున్నారు’ అంటూ ఆరోపణలు గుప్పించారు. కానీ, జగన్ తన హయాంలో ఆక్వా రైతులకు ఎలాంటి గతి పట్టించారు? ఇప్పుడు చేతులు దులుపుకుంటోంది చంద్రబాబా లేక జగన్‌మోహన్‌రెడ్డా? ఈ రొయ్యల రాజకీయంలో అసలు నిజం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రొయ్యలపై దిగుమతి సుంకాన్ని 3% నుంచి 26%కి పెంచడంతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులపై పిడుగు పడినట్లైంది. ఈ టారిఫ్ ఎఫెక్ట్ భారత్‌తో పాటు చాలా దేశాలను కుదిపేస్తుండగా, ఏపీ సీఎం చంద్రబాబు వేగంగా స్పందించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాసి, ఆక్వా రైతులను ఆదుకోవాలని, ఈ సుంకం నుంచి ఆక్వా రంగాన్ని మినహాయించాలని కోరారు. సమస్య పరిష్కారానికి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కానీ, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి దీన్ని చంద్రబాబుపై బురద జల్లే అవకాశంగా చూశారు. ట్రంప్ నిర్ణయాన్ని పక్కనపెట్టి, “ఆక్వా రంగం సంక్షోభంలో ఉంది, టీడీపీ సిండికేట్ రైతులను దోచుకుంటోంది” అంటూ విమర్శలు గుప్పించారు.
అయితే, తన హయాంలో ఆక్వా రైతుల గతేంటో జగన్ గజినీలా మర్చిపోయినట్లున్నారు. విద్యుత్ రాయితీలను ఎత్తేసి, రైతుల నెత్తిన కరెంట్ బిల్లుల భారం మోపారు అప్పటి సీఎం జగన్ మోహన్‌రెడ్డి. 2022 వరకు యూనిట్‌కు రూ.1.50 రాయితీ ఇస్తూ వచ్చిన జగన్ సర్కార్, ఆ తర్వాత 5 ఎకరాల లోపు సాగు చేసేవారికి మాత్రమే పరిమితం చేసింది. 5 ఎకరాలకు పైగా సాగుచేసే రైతులు యూనిట్‌కు రూ.3.85 చెల్లించాల్సి వచ్చింది. ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు గతంలో ఖర్చే ఉండేది కాదు.. కానీ జగన్ హయాంలో రూ.2-3 లక్షలు కట్టాల్సిన పరిస్థితి తెచ్చారు.
ఇది కూడా చదవండి: Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. వెంటనే కోనేయండి.. తులం ఎంతంటే..!
సీడ్, ఫీడ్ ధరలు నియంత్రణ లేకుండా పెరిగిపోగా, దళారుల సిండికేట్ విజృంభించింది. రొయ్యల ధరలు సిండికేట్లే నిర్ణయించేలా వదిలేసి, రైతులను కుదేలు చేశారు మాజీ షీఎం జగన్మోహన్‌రెడ్డి. జగన్ పాపాలకు బలైన ఆక్వా రైతుల పరిస్థితి ఆనాడు ఎలా ఉండేదో ఓ రెండు మూడు ఘటనలు గుర్తు చేసుకుంటే అర్థమవుతోంది. పశ్చిమ గోదావరికి చెందిన ఓ ఆక్వా రైతు, తన కుమార్తెకి కుదుర్చుకున్న పెళ్లి సంబంధాన్ని వదిలేసుకున్నారు. రెండున్నర కోట్లు నష్టపోయిన ఓ కోస్తా ప్రాంత రైతు, తన మూడెకరాల భూమి అమ్ముకోవాల్సి వచ్చింది. కైకలూరు ప్రాంతానికి చెందిన మరో ఆక్వా రైతు, ఇద్దరు కుమారుల చదువును బీటెక్‌లోనే ఆపించారు. అమెరికా వెళ్లి ఎమ్ఎస్ చేయాలని కలలుగన్న ఆ ఇద్దరు యువకులు హైదరాబాద్‌లో చిరుద్యోగులుగా మారారు. దేశంలో ఆక్వాకు చిరునామాగా భావించే ఆంధ్రప్రదేశ్‌లో, 70శాతం మంది ఆక్వా రైతులవి ఆనాడు ఇలాంటి కన్నీటి గాథలే.
ఇప్పుడు ట్రంప్ సుంకాల సమస్య వచ్చిపడగానే, చంద్రబాబు కేంద్రాన్ని ఆశ్రయించి, పరిష్కార మార్గాలు చూస్తుంటే, జగన్ మాత్రం బెంగళూరు ప్యాలెస్ నుంచి ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసి, తిరిగి “చేతులు దులుపుకున్నారు” అంటూ చంద్రబాబుపైనే ఆరోపిస్తున్నారు. నెటిజన్లు మాత్రం ఈ విషయంలో జగన్‌ను ట్రోల్స్‌తో తెగ ఆటాడేసుకుంటున్నారు. ట్రంప్ చేసిన దానికి బాబును తిట్టడం ఏంటి జగన్ అంటూ ప్రశ్నిస్తున్నారు. నువ్వైతే ట్రంప్ మెడలు వంచి సుంకాన్ని రద్దు చేయించేవాడివా? కేసుల భయంతో కనీసం కేంద్రాన్ని కూడా సాయం అడగలేని పరిస్థితిలో ఉండేవాడివంటూ చురకలంటిస్తున్నారు.
రాష్ట్రంలో 3.5 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. దేశంలోనే రొయ్యల సాగుకు ఏపీ ప్రసిద్ధి చెందింది. అటువంటి ఆక్వా రంగాన్ని ట్రంప్ ఉపద్రవం నుండి కాపాడేలా చంద్రబాబు శరవేగంగా చర్యలు తీసుకుంటూ ఉంటే… జగన్ మాత్రం తన హయాంలో ఆక్వా రంగాన్ని ఎలా ముంచేసింది దాచేసి, కూటమిపై నిందలు వేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అయినా జగన్ అరాచకాలు ఎలాంటివో ఆక్వా రైతులకు తెలీదా అంటూ తమ కామెంట్లతో చీవాట్లు పెడుతున్నారు నెటిజన్లు.

