Ys Sunitha: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత, ఆమె భర్త నేడు కడప ఎస్పీ అశోక్ కుమార్‌ను కలిశారు. వివేకా హత్య కేసులో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను ఎస్పీకి వివరించారు. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్టు సమాచారం.
మీడియాతో మాట్లాడిన సునీత, జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో పులివెందులలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తన తండ్రి హత్యను గుర్తు చేస్తున్నాయని అన్నారు. అప్పుడు గొడ్డలితో హత్య చేసి గుండెపోటు అని బహిరంగంగా ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“వివేకాను టీడీపీ నేతలే హత్య చేశారని నమ్మమన్నారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను మాయ చేసి, చివరికి ఓ లేఖ తీసుకొచ్చి మా నాన్నను ఆదినారాయణరెడ్డి, సతీశ్ రెడ్డి, బీటెక్ రవి చంపారని రాయమన్నారు. నేను అలా రాయలేదు. ఇప్పుడు అదే విధంగా ఉప ఎన్నికల్లోనూ జరుగుతోంది” అని సునీత అన్నారు.
ఇప్పటి వరకు తన తండ్రి హత్యకు న్యాయం జరగలేదని, గత ఆరేళ్లుగా తానే పోరాడుతూ వస్తున్నానని తెలిపారు. నిజమైన నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, తాను, తన భర్త హత్య చేశారు అన్న తప్పుడు ప్రచారాన్నిరు ఇష్టప్రకారం వెదజల్లుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.