YS sharmila:దేశంలో లోక్‌సభ స్థానాల డీలిమిటేషన్ అంశంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు ఏకమవుతున్న వేళ.. ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తాజాగా చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీడీపీ, జనసేన పార్టీలు పాల్గొనలేదు. ఆయా పార్టీలు డీలిమిటేషన్ అంశంపై నోరుమెదపకపోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తంచేశారు.
YS sharmila:డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదని, ఈ ప్రాంత ప్రజల కోసం చేసే పోరాటమని ఆమె ఉద్ఘాటించారు. జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాది ప్రాంత రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనిద్వారా ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం పెరుగుతుందని తెలిపారు. సొమ్ము దక్షిణాది ప్రాంతానిది అయితే సోకు ఉత్తరాది ప్రాంతానికి అన్నట్టు పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు.
YS sharmila:జనాభా ప్రాతిపదికన ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని షర్మిల స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభ స్థానాలు ఉత్తరాదిలో పెద్ద ఎత్తున పెరుగుతాయని, దక్షిణాది మొత్తం కలిపినా 192 సీట్లకే పరిమితం అవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సీట్లు కూడా కేవలం ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పెరిగే 222 సీట్ల కంటే తక్కువగానే ఉంటాయని తెలిపారు. ఇది కాదా వివక్ష అని ఆమె ఉదాహరణగా చెప్పారు.
YS sharmila:ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ అంశంపై వైఎస్సార్సీపీ అధినేత, తన సోదరుడైన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నోరు విప్పకపోవడంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‌పై స్పందించకపోవడమంటే ప్రధాని మోదీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్టేనని విమర్శించారు. రాజకీయాలను పక్కనబెట్టి వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
YS sharmila:డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఐక్యంగా పోరాడితే తప్ప నియంత మోదీకి బుద్ధిరాదని పేర్కొన్నారు. ఏపీలో మోదీ పక్షమైన చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాన్ మౌనం వహించడమంటే రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టేనని విమర్శించారు. ప్రజల హక్కులను కాలరాసినట్టేనని ధ్వజమెత్తారు.