Ys Sharmila: రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర యూరియా కొరతను ఎదుర్కొంటున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సహజంగా ఏర్పడిన సంక్షోభం కాదని, అధికార పార్టీ నేతలే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఖరీఫ్ సీజన్‌లో రైతుల ఇబ్బందులు
ఖరీఫ్ సాగు కోసం ఎరువులు దొరకక రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతమని షర్మిల మండిపడ్డారు. తెల్లవారుజాము నుంచే రైతులు కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడినా ఎరువులు అందడం లేదని, రైతు సేవా కేంద్రాల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయని ఆమె తెలిపారు.
యూరియా ధరలపై ఘాటు విమర్శ
ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం రూ.266కు అమ్మాల్సిన యూరియా బస్తా మార్కెట్‌లో రూ.500కు అమ్మబడుతోందని షర్మిల ఆరోపించారు. “దీని వెనుక పెద్ద దందా నడుస్తోంది” అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఇప్పటికే 6.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా చేరిందని ప్రభుత్వం చెబుతుంటే ఆ నిల్వలు ఏమయ్యాయని ఆమె నిలదీశారు.
బ్లాక్ మార్కెట్ ఆరోపణలు
“రైతులకు అందాల్సిన యూరియాను అక్రమంగా గోదాములకు తరలించి, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారు” అంటూ షర్మిల కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. వ్యవసాయ, విజిలెన్స్ శాఖలు ఈ అక్రమ రవాణాను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వంపై డిమాండ్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టి, ప్రైవేట్ వ్యాపారులపై విజిలెన్స్ దాడులు నిర్వహించాలని కోరారు. అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై నిత్యావసర వస్తువుల చట్టం (EC Act) కింద చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్‌కు అదనంగా అవసరమైన 1.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వెంటనే సొసైటీల ద్వారా రైతులకు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

