YS sharmila: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ఆదుకునే బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. మిర్చి పంటకు పెట్టుబడి కూడా రాక రైతులు భారీగా నష్టపోతున్నారని, క్వింటాకు రూ. 15 వేల నష్టంతో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆదివారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన షర్మిల, మిర్చి రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం వారిని మరింత కష్టాల్లోకి నెట్టేస్తోందని ఆరోపించారు. మిర్చి రైతులకు రూ. 11 వేల మద్దతు ధర కల్పించామని చెప్పడం తప్పుడు ప్రచారమని, నిజానికి రైతులకు ఎకరాకు లక్షన్నర రూపాయల పెట్టుబడి పెట్టినా అంతటి ఆదాయం రావడం లేదని వివరించారు.
కౌలు రైతులు మరింత తీవ్రంగా నష్టపోతున్నారని, వారికి అదనంగా రూ. 50 వేల మేర నష్టం సంభవిస్తోందని షర్మిల వెల్లడించారు. రైతుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, తాము న్యాయం కోసం పోరాడతామని స్పష్టం చేశారు. మిర్చి రైతుల సంక్షేమం కోసం వెంటనే కనీస మద్దతు ధరను రూ. 26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
అలాగే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బోనస్ ప్రకటించాలని షర్మిల సూచించారు. రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మిర్చి రైతులతో పాటు టమాటా రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని, వారి సమస్యలను కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

