YS Jagan

YS Jagan: మొంథా తుఫాన్‌ బాధిత రైతులను పరామర్శించిన జగన్.. కూటమి సర్కారుపై విమర్శల దాడి

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వచ్చిన మొంథా తుఫాను రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది. ఈ తుఫాను సృష్టించిన విధ్వంసం, పంట నష్టాల నేపథ్యంలో, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలోని తుఫాను బాధితులైన రైతులతో నేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రైతులను పరామర్శించి, పంట నష్టం గురించి, ప్రభుత్వం నుండి వారికి అందిన సహాయం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రైతుల పరిస్థితిని చూసిన జగన్, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే, బయట పొలాల్లోకి వెళ్లి చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం రైతు పట్ల ఏ మాత్రం కనికరం లేకుండా, నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల నుండి కర్నూలు వరకు తుఫాను ప్రభావం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, బత్తాయి వంటి పంటలు నాలుగు లక్షల ఎకరాల్లో నీట మునిగాయని, తీవ్రమైన గాలులకు పంటలు దెబ్బతినడం వలన రైతులు తమ ఆరుగాలం కష్టాన్ని కోల్పోయారని జగన్ అన్నారు.

ప్రధానంగా జగన్ లేవనెత్తిన ప్రశ్నలు:

1. ఈ 18 నెలల ప్రభుత్వ కాలంలో ఒక్క రైతుకైనా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారా?

2. రైతులకు పంటల బీమా డబ్బులు, పెట్టుబడి సాయం అందించారా?

జగన్ తన విమర్శలను కొనసాగిస్తూ, ప్రస్తుత ప్రభుత్వం రైతుల వెన్ను విరిచిందని ఆరోపించారు. తమ హయాంలో అమలు చేసిన ఉచిత పంటల బీమా వంటి పథకాలు ఇప్పుడు లేకుండా పోయాయని, రైతులు వేల రూపాయల నుండి లక్షల్లో నష్టపోతున్నారని తెలిపారు. అంతేకాకుండా, ప్రస్తుతం ఎరువులు కూడా బ్లాకులో కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి దారుణమైన పరిస్థితులు లేవని ఆయన అన్నారు. ఇన్ని కష్టాలు పడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా దొరకడం లేదని, ప్రతి అడుగులోనూ రైతు నష్టపోతున్నాడని ఆయన ఆవేదన చెందారు.

గతంలో తమ వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు అండగా నిలబడ్డామని, రైతులు భయపడకుండా “జగన్ ఉన్నాడు” అన్న ధైర్యంతో ఉండేవారని జగన్ గుర్తు చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా, సచివాలయంతో అనుసంధానమై ఈ-క్రాప్ బుకింగ్ పక్కాగా జరిగేదని, రైతుకు నష్టం జరిగినప్పుడు తక్షణమే నష్టపరిహారం అందేదని వివరించారు. పంటలకు ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించి, మార్క్‌ఫెడ్ ద్వారా మార్కెట్‌లో పోటీని సృష్టించి గిట్టుబాటు ధరలు ఇచ్చేదని, అలాగే ₹3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *