YS Jagan

YS Jagan: దోచుకో.. పంచుకో.. తినుకో.. కూటమి పాలనపై జగన్ సంచలన వ్యాఖ్యలు!

YS Jagan: రాష్ట్ర ప్రస్తుత పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉన్నా, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నట్లు చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. “దోచుకో.. పంచుకో.. తినుకో” అన్న రీతిలో టీడీపీ నేతల వ్యవహారం సాగుతోందని, రాష్ట్ర వనరులను ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

పాలన గాలికి వదిలేసి విలాసాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారని జగన్ విమర్శించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి నేతలు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. మ్యాచ్ చూడటానికి కొలంబో వరకు ప్రత్యేక విమానంలో వెళ్లాల్సిన అవసరం ఏముంది? టీవీలో చూస్తే మ్యాచ్ కనిపించదా? అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో విలాసాలు చేస్తూ, మరోవైపు రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

అప్పుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకుందని జగన్ విమర్శించారు. ఎన్నిసార్లు సాక్ష్యాలు చూపినా అబద్ధాలనే నిజం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు నిజాలు తెలిసిపోతాయనే భయంతోనే బడ్జెట్ పత్రాల్లో అప్పులకు సంబంధించిన పట్టికను తొలగించారని ఆయన ఆరోపించారు. ఇలా బడ్జెట్ పత్రాల్లో వివరాలు దాచడం గతంలో ఎన్నడూ జరగలేదని, ఇక్కడ దాచినా కాగ్ వంటి కేంద్ర సంస్థల నివేదికల్లో నిజాలు బయటపడక తప్పవని హెచ్చరించారు.

అసలైన లెక్కలను వివరిస్తూ.. 2023-24 నాటికి రాష్ట్ర అప్పులు రూ. 2,57,509 కోట్లు మాత్రమేనని జగన్ స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం రూ. 9 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత 20 నెలల కాలంలోనే ప్రస్తుత ప్రభుత్వం రూ. 3,17,448 కోట్ల అప్పు చేసిందని ఆయన ఆరోపించారు. ఆధారాలతో సహా వాస్తవాలు కనిపిస్తున్నా, బడ్జెట్ డాక్యుమెంట్లతో ఆటలాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని జగన్ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *