YS Jagan

YS Jagan: కూటమి ప్రభుత్వంపై వై.ఎస్. జగన్ ఫైర్

YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని ఆయన ధ్వజమెత్తారు. తన పాలనలో ఉద్యోగులకు చేసిన మేలును గుర్తుచేస్తూ, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సూటిగా ప్రశ్నిస్తూ ఎక్స్ (X) వేదికగా ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.

తీపి మాటలతో మోసం!
ఎన్నికలకు ముందు ఉద్యోగులకు మధురమైన మాటలు చెప్పి, ఇప్పుడు వారిని నడిరోడ్డు మీద నిలబెట్టడం అన్యాయమని జగన్ నిలదీశారు. “ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది?” అని ప్రశ్నించారు. మంత్రివర్గ సమావేశాలు జరిగిన ప్రతిసారీ, తమ హామీల అమలు గురించి ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూసి, చివరికి ఉసూరుమంటున్నారని పేర్కొన్నారు.

“మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీదే ఉంది తప్ప, ప్రజలమీద, ఉద్యోగులమీద కాదు. ఇది కపట ప్రేమ,” అంటూ జగన్ ఘాటుగా విమర్శించారు. ఉద్యోగులకు వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు అలవాటేనని ఆరోపించారు.

హామీలు ఏమయ్యాయి?
మాజీ సీఎం జగన్, కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన హామీలను గుర్తుచేస్తూ, ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు:

* IR (మధ్యంతర భృతి): “అధికారంలోకి వచ్చిన వెంటనే IR ఇస్తామన్నారు, ఇచ్చారా? మేం వచ్చిన వారం రోజుల్లోనే IR ప్రకటించాం,” అని జగన్ గుర్తు చేశారు.

* PRC (వేతన సవరణ సంఘం): “మెరుగైన PRC అంటూ ఊదరగొట్టారు. మరి PRC సంగతేమైంది?” అని ప్రశ్నించారు. అంతేకాదు, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే PRC చైర్మన్‌ను ఉద్దేశపూర్వకంగా వెళ్లగొట్టి, కొత్తవారిని నియమించకుండా అన్యాయం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. తమ హయాంలోనే PRC వేసి, చైర్మన్‌ను కూడా నియమించామని గుర్తు చేశారు.

* పెండింగ్ డీఏలు (Dearness Allowance): ఉద్యోగులకు ఇప్పటివరకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, దసరాకు క్లియర్ అవుతాయని ఆశించినా ఇవ్వలేదని, ఇప్పుడు దీపావళి కూడా వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

CPS, జీపీఎస్‌పై కల్లబొల్లి కబుర్లు
CPS స్థానంలో OPS (పాత పింఛన్ విధానం) తీసుకొస్తామని గొప్పగా చెప్పి, ఇప్పుడేమీ చేయకుండా ఉద్యోగులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారని జగన్ అన్నారు. తమ ప్రభుత్వం CPSకు గొప్ప ప్రత్యామ్నాయంగా GPS (గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం) తీసుకొచ్చిందని, దానిని ఇప్పుడు కేంద్రం సహా పలు రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయని గుర్తు చేశారు.

₹31 వేల కోట్ల బకాయిలు
ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపు ₹31 వేల కోట్లు పేరుకుపోయాయని జగన్ వెల్లడించారు. వీటిలో PRC బకాయిలు, పెండింగ్ డీఏలు, GPF, APGLI, మెడికల్ రీయింబర్స్‌మెంట్లు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ వంటివి ఉన్నాయని తెలిపారు. ఈ డబ్బులు ఇవ్వక, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జీతాలు, పెన్షన్ల ఆలస్యం
“ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఏ తేదీకి ఇస్తారో తెలియని దుస్థితి ఏర్పడింది,” అని జగన్ ఆక్షేపించారు. కరోనా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడూ తాము సకాలంలో జీతాలు ఇచ్చామని, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు లేకపోయినా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు.

వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులపైనా కక్ష
* వాలంటీర్లు: వాలంటీర్ల జీతం ₹5 వేల నుంచి ₹10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి, ఇప్పుడు కుట్రపన్ని, వారి పొట్టకొట్టి రోడ్డున పడేశారని జగన్ విమర్శించారు.

* ఔట్‌సోర్సింగ్ & కాంట్రాక్ట్ ఉద్యోగులు: APCOSను రద్దు చేసి, మళ్లీ దళారీ వ్యవస్థను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. తమ హయాంలోనే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచామని, వారి జీతాల బిల్లును ₹1,100 కోట్ల నుంచి ₹3 వేల కోట్లకు పెంచామని గుర్తు చేశారు.

* EHS (ఉద్యోగుల ఆరోగ్య పథకం): EHS కింద ఆస్పత్రులకు చెల్లించాల్సిన డబ్బు ఇవ్వకపోవడంతో, ఆస్పత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయని, హెల్త్ కార్డులు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

చివరిగా, గత రెండేళ్ల కాలంలో చంద్రబాబు ఉద్యోగులకైనా, ప్రజలకైనా వెన్నుపోటే పొడిచారని, ఇచ్చిన హామీలన్నీ మోసాలుగా మారిపోయాయని, అందుకే వారంతా రోడ్డెక్కుతూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారని జగన్ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *