Youtuber Anvesh Case: వివాదాస్పద యూట్యూబర్ అన్వేష్ త్వరలో భారతదేశానికి రప్పించనున్నారా? హిందూ దేవతలపై అతను చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయా? ఎట్టి పరిస్థితుల్లో అతన్ని జైలుపాలు చేయాల్సిందేనని అత్యధిక మంది కోరుతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన యూట్యూబర్ అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవతలను కించపరుస్తూ, దూషిస్తూ వీడియే చేశాడు. హిందువలనే టార్గెట్‌గా అతను చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా భగ్గుమన్నారు.
Youtuber Anvesh Case: నా అన్వేషణ, ప్రపంచ యాత్రికుడు అనే యూట్యూబ్ చానళ్లతో భారత్‌తోపాటు వివిధ దేశాల్లో లక్షలాది మంది సబ్‌స్క్రయిబర్లను సంపాదించాడు. ప్రపంచంలో వివిధ దేశాలను తిరుగుతూ అక్కడి విశేషాలను తన వీడియోల ద్వారా చూపిస్తున్నారు. దీంతో నెలనెలా లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు. ఇటీవల అతను వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్‌లపై పలు వీడియోలు చేశాడు. ఈ విషయంలో పరిమితికి మించి బెట్టింగ్ యాప్‌లు చేసే వారి వ్యక్తిగత జీవితాలపై, వారి కుటుంబ సభ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
Youtuber Anvesh Case: ఇటీవల నటుడు శివాజీ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆయనతోపాటు శతావధాని గరికపాటిని హేళన చేస్తూ వీడియో చేశాడు. ఇదే సమయంలో హిందూ దేవతలైన సీత, ద్రౌపది ఇతర దేవతలపై దుర్భాషలాడుతూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియోపై భగ్గుమన్న భారతీయులు, ముఖ్యంగా హిందువులు పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో అతని యూట్యూబ్, ఇన్‌స్టా పేజీలను అన్‌సబ్‌స్క్రయిబ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ లక్షలాది మంది అన్‌సబ్‌స్క్రయిబ్ కావడం గమనార్హం.
Youtuber Anvesh Case: యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై తెలంగాణ, ఆంధ్ర సహా దేశవ్యాప్తంగా వివిధ కేసులు నమోదవుతున్నాయి. సినీనటి, బీజేపీ నాయకురాలు కరాటే కల్యాణి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు అన్వేష్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 352, 79, 299, ఐటీ చట్టంలోని 67 సెక్షన్ కింద పోలీసులు కేసులను నమోదు చేశారు. ఖమ్మం జిల్లా దానవాయిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూడా ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సామాజిక భావోధ్వేగాలను రగిలించేలా అన్వేష్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు.
Youtuber Anvesh Case: ఇదిలా ఉండగా, తాను 14 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వాంఛ తీర్చుకున్నానంటూ బహిరంగంగా వీడియోలో అన్వేష్ చెప్పుకొచ్చాడు. దానిపైనా పోస్కో చట్టం కింద కేసు నమోదు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తున్నది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అన్వేష్‌ను భారతదేశానికి రప్పించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తరచూ భావోద్వేగాలను రెచ్చగొడుతూ విదేశాల్లో తిష్ట వేసిన అన్వేష్‌ను రప్పించేందుకు పోలీసులు కేంద్రం అనుమతి కోరనున్నట్టు తెలుస్తున్నది. అంతర్జాతీయ చట్టాలను అనుసరించి రప్పిస్తారని తెలుస్తున్నది. ఈ మేరకు వచ్చే ఏడాది 2026లో అన్వేష్‌ను ఎట్టి పరిస్థితుల్లో భారత దేశానికి రప్పించే అవకాశం ఉన్నది.
