Actress Nandini: తమిళ, కన్నడ బుల్లితెర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ నటి నందిని ఆత్మహత్యకు పాల్పడటం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ తెలుగమ్మాయి తన మాతృభాషలో కాకపోయినప్పటికీ, ఇతర భాషల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. బెంగళూరులోని తన నివాసంలో ఆమె విగతజీవిగా కనిపించగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆమె హఠాత్తుగా ఇంటికి వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆమె మంచంపై లభించిన సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు కీలక విషయాలను సేకరిస్తున్నారు.
గత కొద్దికాలంగా వ్యక్తిగత సమస్యలతో పాటు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్న నందిని, మానసిక వేదన తట్టుకోలేక ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో, కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకున్న ఆమె తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు సన్నిహితులు చెబుతున్నారు. కేవలం 20 ఏళ్ల వయస్సులోనే ఎంతో భవిష్యత్తు ఉన్న నటి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అభిమానులను కలిచివేస్తోంది. కన్నడలో తన కెరీర్ ప్రారంభించిన నందిని, కొద్ది కాలంలోనే అక్కడ స్టార్‌గా ఎదిగారు. అనంతరం తమిళంలో ‘గౌరీ’ అనే సీరియల్ ద్వారా ద్విపాత్రాభినయం చేసి ఇంటింటికీ పరిచయమయ్యారు.
నందిని నటించిన ‘జీవా హూవాగే’, ‘నీనాదే నా’, ‘సంఘర్ష’, ‘మధుమగల్’ వంటి సీరియల్స్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆమె మరణవార్త తెలుసుకున్న తోటి నటీనటులు, దర్శకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.
