Telangana: యాదాద్రి జిల్లాలో కులంతర వివాహం ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి, అల్లుడిని చంపాలనే కక్షతో యువతి కుటుంబ సభ్యులు అత్యంత కిరాతకంగా దాడి చేశారు. కేవలం మూడు రోజుల ముందే మూడు ముళ్లు వేసుకున్న ఆ జంట జీవితంలో ఈ ఘటన పెద్ద విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
ప్రేమ వివాహం.. కుటుంబాల మధ్య గొడవ
బొమ్మలరామారం మండలం రామలింగంపల్లికి చెందిన అజయ్ కుమార్, లావణ్య గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో లావణ్య కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి సమ్మతించలేదు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో, మూడు రోజుల క్రితం ఈ ప్రేమికులు ఇద్దరూ బయటకు వెళ్లి వివాహం చేసుకున్నారు. తమ కూతురు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో లావణ్య కుటుంబం అజయ్‌పై పగ పెంచుకుంది.
మెసేజ్ పంపి.. మాటు వేసి..
పథకం ప్రకారం, లావణ్యకు నచ్చజెప్పినట్లు నటించి ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. బుధవారం రోజున లావణ్య ఫోన్ నుంచే ఆమె సోదరుడు అజయ్‌కు మెసేజ్ పంపాడు. తన భార్యే పిలుస్తోందని నమ్మిన అజయ్, ఆమెను కలవడానికి రామలింగంపల్లి శివార్లకు వెళ్లాడు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న లావణ్య సోదరుడు మరియు అతని స్నేహితులు అజయ్‌ను చుట్టుముట్టారు.
14 సార్లు కత్తితో పొడిచి..
దుండగులు మొదట అజయ్ కళ్లలో కారం కొట్టి, ఆపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. శరీరంపై ఏకంగా 14 సార్లు కత్తితో పొడవడంతో అజయ్ తీవ్ర రక్తగాయాలతో కుప్పకూలిపోయాడు. అతను చనిపోయాడని భావించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, అజయ్‌ను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడిన 8 మందిని పోలీసులు గుర్తించి, వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
