Telangana: కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఓ యువ రైతు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ గేటు వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తన భూమి విషయంలో ప్రభుత్వ అధికారులు సహకరించకపోవడం, పదేపదే ఇబ్బందులు పెట్టడంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
కొడంగల్ నియోజకవర్గంలోని చిట్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు తన తల్లి వడ్డె చంద్రమ్మ పేరు మీద ఉన్న 24 గుంటల భూమి కోసం కొద్దికాలంగా పోరాడుతున్నారు. ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉన్నప్పటికీ, అటవీ శాఖ అధికారులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆయన తెలిపారు.
బతుకుదెరువు కోసం ముంబైకి వెళ్లొచ్చేలోపు, అధికారులు తమ భూమిని అటవీ శాఖకు చెందింది అంటూ బోర్డు పెట్టి, నిషేధిత జాబితాలో చేర్చడం తనను నిరాశకు గురిచేసిందని శ్రీనివాస్ వాపోయారు. తన భూమిని సర్వే చేయించాలని కోరుతూ 11 సార్లు కలెక్టర్ కార్యాలయం చుట్టూ, అనేకసార్లు అటవీ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్వయంగా భూమి సర్వే కోసం ఆదేశాలు ఇచ్చినా, స్థానిక అధికారులు మాత్రం వాటిని ఏమాత్రం లెక్కచేయడం లేదని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, అధికారులు తన సమస్యను పరిష్కరించకపోగా, మరింత వేధిస్తున్నారనే బాధతో శ్రీనివాస్ కలెక్టరేట్ గేటుకు చేరుకున్నారు.
తన చావుకు కారణం కొడంగల్ ఎఫ్‌ఆర్‌వో, డీఎఫ్‌వోలే అని లేఖ రాసి, అనంతరం గేటుకు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు, సిబ్బంది వెంటనే స్పందించి శ్రీనివాస్‌ను కాపాడి, ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ప్రభుత్వ అధికారుల తీరుపై మరోసారి తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

