Priyanka Gandhi: దేశ భద్రతపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం అసంతృప్తి వ్యక్తం చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలకు స్పందించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, న్యాయమూర్తుల వ్యాఖ్యల పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
రాహుల్‌గాంధీ డిసెంబర్ 16, 2022న భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన “2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది” అన్న వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్‌ల ధర్మాసనం, “భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఎలా అంటారు? దానికి ఆధారాలు ఏంటి? మీరు నిజమైన భారతీయులైతే అలా మాట్లాడరని” వ్యాఖ్యానించింది.
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిందని అంటాడు..రూ.6000 కోట్లకు టెండర్లు..
ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ప్రియాంక గాంధీ, “ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష నేతగా రాహుల్‌గాంధీ బాధ్యత. అలాంటి వ్యాఖ్యలకే అతను నిలబడ్డాడు. కానీ నిజమైన భారతీయుడు ఎవరో నిర్ణయించే హక్కు న్యాయమూర్తులకూ లేదు” అని స్పష్టం చేశారు. తన సోదరుడు ఎప్పుడూ సైన్యాన్ని నిర్లక్ష్యంగా చూసిన పాపం చేయలేదని, ఆర్మీకి అత్యంత గౌరవంతో మాట్లాడే వ్యక్తి అని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిపై తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నిజానికి తప్పుడు వివరణ అని పేర్కొన్నారు.
“ప్రతిపక్ష నాయకుడికి తగిన గౌరవం ఇవ్వాలి. మన ప్రాథమిక హక్కులు, ఆలోచన స్వేచ్ఛను పరిరక్షించడమే న్యాయవ్యవస్థ ధర్మం. కానీ ఇప్పుడు అదే ప్రశ్నించబడుతోంది,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకవైపు దేశ భద్రతపై మాట్లాడే స్వేచ్ఛపై ప్రశ్నలొస్తుంటే, మరోవైపు న్యాయవ్యవస్థ పాత్రపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.