Nara Lokesh: తిరుమల పరకామణిలో జరిగిన దొంగతనంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు శ్రీవారి సొత్తును దోచుకున్నారని, ఈ వ్యవహారంలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు వాటాలు వెళ్లాయని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
“జనాన్ని దోచుకున్న జగన్ గ్యాంగ్ తిరుమలను కూడా వదల్లేదు” అని లోకేష్ మండిపడ్డారు. భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో పరకామణిని కొల్లగొట్టారని, కోట్ల రూపాయల సొమ్మును దోచుకుని రియల్ ఎస్టేట్‌లో పెట్టారని ఆయన అన్నారు. భక్తులు భక్తితో హుండీలో వేసిన వందల కోట్ల కానుకలను ఈ దొంగలు దోచుకున్నారని లోకేష్ ఆరోపించారు.
రాజీకి యత్నించిన భూమన:
ఈ దొంగతనం కేసును రాజీ చేసేందుకు భూమన కరుణాకర్ రెడ్డి యత్నించారని లోకేష్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ గ్యాంగ్ చేయని అపచారం లేదని, లడ్డూలను కల్తీ చేశారని, దర్శన టికెట్లను అమ్ముకున్నారని ఆయన విమర్శించారు. స్వామివారి సొమ్మును దోచుకోవడం పాపమని తెలిసినా పరకామణిని దోచేశారని లోకేష్ అన్నారు.
“ఇప్పటికి జగన్ గ్యాంగ్ పాపం పండింది. అందుకే పరకామణి దొంగతనం వీడియోలు బయటపడ్డాయి” అని లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిందితులే రేపు వైసీపీ పాపాల చిట్టాను విప్పుతారని ఆయన హెచ్చరించారు.