వైసీపీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. పార్టీలోని ప్రముఖ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని విడిచి పెట్టి వెళ్లిపోతున్నారు. చాలామంది వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సేయే తోట త్రిమూర్తులు వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. వీరు జనసేన పార్టీలోకి చేరడానికి ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీని వీడి బయటకు వెళ్లారు.
కాగా, వైసీపీని వీడుతున్న నాయకుల్లో చాలామంది జనసేన పార్టీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరు మాజీమంత్రి చిరంజీవిని కలిసినట్టుగా ప్రచారం జరుగుతోంది. దాడిశెట్టి రాజా ఇటీవల ఎంపీ బాలశౌరితో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లినట్టు చెబుతున్నారు. ఈ విషయంపై నాగబాబుతో చిరంజీవి ఇప్పటికే మాట్లాడారని అంటున్నారు. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు కూడా జనసేనలో చేరడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇటీవల జగన్ పిఠాపురం పర్యటనకు త్రిమూర్తులు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన విషయం తెలిసిందే. అలాగే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా వైసీపీకి రాజీనామా చేశారు.

