YCP Leaders Abscond: ఏంటండీ మాట్లాడితే రెడ్ బుక్ అంటారు. ఒంటి చేత్తో కేంద్రాన్ని, సోనియా గాంధీని ఎదిరించిన పులిబిడ్డ మా అధినేత. అతనే మా ధైర్యం. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడం. జైళ్లో పెడితే పెట్టుకోండి. మూడు నెలల్లో బెయిల్‌పై బయటకొస్తాం. మీ అంతు చూస్తాం. అల్లాడిస్తాం అంతే.! ఇవీ మొన్నటిదాకా పలువురు వైసీపీ నేతలు ప్రెస్మీట్లలో పలికిన ప్రగల్భాలు, బహిరంగ హెచ్చరికలు. అలా డైలాగులు కొట్టి, ఆ వీడియోలను పార్టీ అధిష్టానానికి పంపి, కేజీఎఫ్, సలార్ ఎలివేషన్‌లతో సోషల్‌మీడియా బ్యాచ్‌లతో ప్రచారం చేయించుకున్న నేతలు.. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోతున్నారట. అండర్ గ్రౌండ్‌కి వెళ్లి.. ముందస్తు బెయిల్ కోసం పడరానిపాట్లు పడుతున్నారట. దీంతో.. వైసీపీ నేతలు వార్నింగ్‌లు ఇస్తారు కానీ.. ఆ తర్వాత కనబడరు.. అంటూ సెటైర్లు పేల్చుతున్నారు నెట్టింట తెలుగు తమ్ముళ్లు.
అధికారం కోల్పోయాక వైసీపీ నేతలు చెప్పే డైలాగులు ఒకలా, చేసే చేష్టలు మరోలా ఉంటున్నాయట. అధికారంలో ఉన్నప్పుడు వెలగబెట్టిన ఘనకార్యాలపై సదరు వైసీపీ నేతలపై కేసులు ఊపందుకుంటున్న నేపథ్యంలో, గతంలో “ఎన్ని కేసులైనా భయపడం” అంటూ గొప్పలు చెప్పిన వారు ఇప్పుడు అజ్ఞాతంలోకి పరారవుతున్నారు. విచారణలు ఎదుర్కొనే ధైర్యం లేక, ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతుండటం చూస్తుంటే.. వారి ప్రగల్భాల వెనుక నిజం బయటపడుతోంది అంటున్నారు రాజకీయ విమర్శకులు.
ప్రస్తతం నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కనిపించడం లేదట. ఎక్కడున్నారో కూడా సమాచారం లేదని చెప్తున్నారట ఆయన సన్నిహితులు సైతం. ఆయనపై క్వార్ట్జ్ ఖనిజం దోపిడీ, 250 కోట్ల అక్రమాలపై కేసు నమోదైంది. గిరిజనులపై బెదిరింపులకు పాల్పడంపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద తాజాగా మరో కేసు నమోదైంది. అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయిన కాకాణి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది కానీ… ఇంకా ఊరట వచ్చినట్లు సమాచారం లేదు. ఆయన ప్రస్తుతం తన ఇంట్లో లేరు. ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉంది. పోలీసులు నోటీసులు అంటించినా స్పందించలేదు. మొన్నటిదాకా పోలీసులపై జులుం ప్రదర్శించి, దమ్ముంటే అరెస్ట్ చేయండి చూద్దాం అన్న వైసీపీ నేతల్లో కాకాణి ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. తమపై కేసులు పెడితే.. తిరిగి తాము అధికారంలోకి వచ్చాక.. సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొస్తాం.. బట్టలూడదీసి నిలబెడతాం అంటూ రెచ్చిపోయారు కాకాణి.
ఇక విడదల రజని. గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రి. ఎక్స్‌టార్షన్‌కి పాల్పడి స్టోన్ క్రషర్ యజమానుల నుంచి రూ. 2.2 కోట్లు వసూళ్లు చేసినట్లు ఆమెపై అభియోగాలున్నాయి. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినా, విచారణ ఏప్రిల్ 2కి వాయిదా పడింది. టీడీపీ కక్ష సాధించాలనుకుంటోందనీ… తనది పురుషోత్తమపట్నం అని గుర్తుంచుకోవాలని డైలాగ్ విసిరారు. జగనన్న ప్రభుత్వం మళ్లీ వస్తుందనీ, ఎవరినీ వదలమని, వడ్డీతో సహా తిరిగిస్తామంటూ మాస్ వార్నింగులు ఇచ్చిన రజినీ… కేసు నమోదైనప్పటి నుండీ నియోజకవర్గంలో కనిపించడం లేదట.
ఇది కూడా చదవండి: Sanitation Worker: అరె ఏంట్రా ఇదీ.. చేసేది పారిశుధ్య పని.. 34 కోట్ల రూపాయల టాక్స్ కట్టాలని నోటీసులు!
మరో మాజీ మంత్రి జోగి రమేష్.. 2021లో చంద్రబాబు నివాసంపై దాడికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి.. అరెస్టు నుండి రక్షణ పొందారు. దేశం విడిచివెళ్లొద్దన్న షరుతుతో జోగికి ముందస్తు బెయిల్ ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. గతంలో మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ రెచ్చిపోయారు జోగి. ప్రస్తుతం అజ్ఞాతం నుంచి బయటకు వచ్చినా… విచారణ ఒత్తిడిలో ఉన్నారు. వైసీపీ నేత దేవినేని అవినాష్‌ది కూడా సేమ్ కేసు. జోగితో పాటూ ఈయనకూ తాత్కాలిక రక్షణ ఇచ్చింది సుప్రీంకోర్టు. టీడీపీకి గట్టి సమాధానం ఇస్తామంటూ వార్నింగులు ఇచ్చిన అవినాశ్.. దుబాయ్‌కు పారిపోయే ప్రయత్నంలో పట్టుబడ్డారు. ఇప్పుడు కోర్టు రక్షణతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
టీడీపీ కార్యాలయ దాడి, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమణలపై సజ్జల రామకృష్ణారెడ్డి, సోషల్మీడియా సైకో సైన్యాన్ని తయారు చేసిన ఆయన పుత్రరత్నం సజ్జల భార్గవ రెడ్డి, భూకబ్జాలు, అటవీ ల్యాండ్స్ ఆక్రమణలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లిక్కర్ స్కామ్‌లో ఆయన పుత్ర రత్నం పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, నెక్స్ట్ నేనే అంటూ ఫిక్స్ అయిన అంబటి రాంబాబు.. ఇలా చెప్పుకుంటూ పోతే మరో డజను మంది చిన్నా, పెద్దా వైసీపీ నేతల పరిస్థితి ప్రస్తుతం జైలు, బెయిలు మధ్య ఊగిసలాడుతోంది. వీరంతా గతంలో ధైర్యంగా హెచ్చరికలు జారీ చేసినా, కేసులు నమోదవగానే అజ్ఞాతంలోకి వెళ్లడం, ముందస్తు బెయిల్ కోసం గుట్టుచప్పుడు కాకుండా మారువేషాల్లో కోర్టుల చుట్టూ తిరగడం, విచారణలు తప్పించుకునేందుకు ఫోన్లు మార్చడం, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు.. ఇలా పక్క రాష్ట్రాలకు మకాం మార్చడం వంటివి చేస్తున్నారు. వీరి పరిస్థితి చూసి.. వైసీపీ నేతలు వార్నింగ్‌లు ఇస్తారు కానీ… ఆ తర్వాత కనబడరు… అంటూ సెటైర్లు పేల్చుతున్నారు నెటిజన్లు.