Toxic Postponed: కన్నడ స్టార్ హీరో యష్ అభిమానులకు చిత్ర యూనిట్ చేదువార్త చెప్పింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic) విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మొదట ఈ నెల (మార్చి) 19న విడుదల కావాల్సిన ఈ సినిమా, ఇప్పుడు ఏకంగా రెండు నెలల పాటు మందులు వెళ్లింది. ప్రస్తుత ఉద్రిక్తతల దృష్ట్యా ఈ చిత్రాన్ని జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ నిర్ణయించింది.
గల్ఫ్ దేశాల్లో యుద్ధం.. వాయిదాకు ప్రధాన కారణం
ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పోరు ఇప్పుడు గల్ఫ్ దేశాలకు పాకడం సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. దుబాయ్, అబుదాబి, కువైట్, ఖతార్ వంటి మిడిల్ ఈస్ట్ (GCC) దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుండటంతో అక్కడ అశాంతి నెలకొంది.
భారతీయ సినిమాలకు, ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలకు గల్ఫ్ దేశాలు చాలా పెద్ద మార్కెట్. అక్కడి డిస్ట్రిబ్యూటర్ల విజ్ఞప్తి మేరకు, ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం రిస్క్ అని భావించిన మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.స్థానిక ప్రజల భద్రత మరియు థియేటర్ల మూసివేత వంటి కారణాలతో విడుదల వాయిదా వేయడమే ఉత్తమమని నిర్మాతలు భావించారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రద్దు
సినిమా విడుదలతో పాటు ప్రచార కార్యక్రమాలకు కూడా ఆటంకం ఏర్పడింది. ఈ నెల మార్చి 8న బెంగళూరులో అత్యంత వైభవంగా నిర్వహించాలనుకున్న ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ వేడుకను కూడా చిత్ర యూనిట్ రద్దు చేసింది. యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించకపోవడంతో, గ్రాండ్ ఈవెంట్స్ నిర్వహించడం సరికాదని మేకర్స్ భావిస్తున్నారు. యష్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.
జూన్ 4న కొత్త విడుదల తేదీ
సమ్మర్ సీజన్‌ను మిస్ చేసుకున్నప్పటికీ, పరిస్థితులు చక్కబడిన తర్వాత జూన్ మొదటి వారంలో రావడం సురక్షితమని యష్ టీమ్ భావిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, వాయిదా పడినా వసూళ్లపై పెద్దగా ప్రభావం ఉండదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నయనతార, కియారా అద్వానీ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

