Delhi Floods: రాజధాని ఢిల్లీని మంగళవారం ఉదయం వరద నీరు ముంచెత్తాయి. యమునా నది ప్రమాద స్థాయిని దాటి 205.80 మీటర్ల వద్ద ప్రవహిస్తోంది. 205.33 మీటర్ల ప్రమాద మోతాదును అధిగమించడంతో లోతట్టు ప్రాంతాలు వరద ముప్పులో ఉన్నాయి. పలు నివాస కాలనీలు నీటమునిగిపోగా, అధికారులు వందల కుటుంబాలను సురక్షిత శిబిరాలకు తరలించారు. సాయంత్రం నాటికి నీటి మట్టం 206 మీటర్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
భారీ వర్షాల కారణంగా రాజధాని స్థంభన
సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ నగరాలను అతలాకుతలం చేశాయి. రహదారులు నదుల్లా మారిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురుగ్రామ్‌లో 7 కి.మీ.కుపైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు త్రేవ్ర ఇబంధులులతో పాటు భయాందోళనకు గురవుతున్నారు.
వరద నీటి విడుదలలు, భద్రత చర్యలు
హత్నికుండ్ బ్యారేజీ నుండి 1.76 లక్షల క్యూసెక్కులు, వజీరాబాద్ బ్యారేజీ నుండి 69,210 క్యూసెక్కులు, ఓఖ్లా బ్యారేజీ నుండి 73,619 క్యూసెక్కులు నీటిని విడుదల చేయడంతో యమునా మరింత ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణం లోతట్టు ప్రాంత ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు తరలిపోవాలని సూచించారు.
లోహా పుల్ వద్ద ట్రాఫిక్‌ను మంగళవారం సాయంత్రం 5 గంటల నుండి నిలిపివేశారు. పాఠశాలలు కూడా ముందస్తు జాగ్రత్తగా మూసివేయబడ్డాయి.
ఇది కూడా చదవండి: Pat Cummins: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు బిగ్ షాక్.. కమిన్స్ ఔట్
వాతావరణ హెచ్చరిక
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం ఢిల్లీలో మంగళవారం కూడా ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 4 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరిక జారీ చేసింది. ఉద్యోగులు సాధ్యమైనంత వరకు ఇంటి నుంచే పనిచేయాలని సూచించారు.
15 ఏళ్ల రికార్డు వర్షపాతం
2025 ఆగస్టు నెలలో ఢిల్లీలో 399.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది గత 15 ఏళ్లలో అత్యధికం. 2010లో 455.8 మి.మీ. వర్షపాతం నమోదైన తర్వాత ఈసారి అత్యధిక వర్షపాతం రికార్డు అయ్యింది. 2024లో కూడా అనూహ్య వర్షాలు కురవడంతో ఆగస్టు 30 నాటికి 390.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.
అధికారుల భరోసా
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రజలను ధైర్యంగా ఉండాలని సూచించారు. “యమునా మైదానాల్లోకి నీరు రావడం సహజం. ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది, అవసరమైన సహాయ చర్యలు చేపడుతున్నాం” అని తెలిపారు. హర్యానా ప్రభుత్వం కూడా ఫీల్డ్ ఆఫీసర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.