Bibinagar: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ చెరువుకట్ట వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన ‘థార్’ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలబడి ఉన్న కొందరిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక యువకుడు, ఒక యువతి మరణించారు, మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: Hyderabad: చంద్రాయన్ గుట్టలో విద్యార్థులు ఉండగానే స్కూల్ భవనం కూల్చివేత
కారు ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, బలంగా దెబ్బ తగలడంతో చెరువు వైపు పడిపోయిన యువతి చెరువులో పడిపోయి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన థార్ కారు కూడా అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే భువనగిరి ఏరియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాదకర ఘటన బీబీనగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది. మరణించిన యువతీయువకుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

