WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 (WPL) లో మరో సంచలనాత్మక పరిణామం చోటు చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. శనివారం యూపీ వారియర్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఫలితంతో బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్ రేసులో నుంచి బయట పడింది.
ఇక ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన మూడు జట్లను అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు సెమీఫైనల్ పోరుకు సిద్ధమవుతున్నాయి. అయితే, పాయింట్ల పట్టికలో ఏ జట్టు మొదటి స్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ కు చేరుకుంటుందో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
ఇది కూడా చదవండి: India Vs New Zealand Final: న్యూజిలాండ్ జట్టు ఇండియాపై మాత్రమే గెలవగలదు..?
పాయింట్ల పట్టికను పరిశీలిస్తే, ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్‌లలో 5 గెలిచి టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. జట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉండగా, నికర రన్ రేట్ +0.396 గా ఉంది. గుజరాత్ జెయింట్స్ 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి, 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు నికర రన్ రేట్ +0.334 గా ఉంది. ఇక ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, +0.267 నికర రన్ రేట్ తో మూడో స్థానాన్ని ఆక్రమించింది.
ప్లేఆఫ్స్ ఫార్మాట్ ప్రకారం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకోనుంది. రెండో మరియు మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ లో తలపడతాయి. ఆ మ్యాచ్ విజేత గ్రాండ్ ఫైనల్ లో అగ్రస్థాన జట్టుతో పోటీపడనుంది.